హైదబారాద్.. రంగారెడ్డి ఏరియాల్లోని బంగారం విక్రయశాలలు వినియోగదారులను తూకం పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారులు రంగంలోకి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ ఏడాదిలో మే.. ఆగస్టు.. అక్టోబర్.. నవంబర్ నెలల్లో బంగారం షాపుల్లోని డిజిటల్ త్రాసులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేపట్టి తేడాలు గుర్తించారు.
ఈ నాలుగు నెలల్లో ఏకంగా 35 దుకాణాలు.. చెయిన్స్ స్టోర్స్.. బహుళ జాతి కంపెనీలపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధించడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి.. మేడ్చల్.. వికారాబాద్ జిల్లాల్లో 3 వేలకు పైగా బంగారం.. వజ్రాభరణాల షాపులు ఉన్నాయి.
ఒక్కో గ్రాము ధర రూ. 5400 లు ఉండగా కొన్ని దుకాణాలు మాత్రం రూ. 5200లకే ఇస్తామని ప్రకటిస్తున్నారు. తమ వద్ద హారం కొంటే వెండి చెంచా.. గ్లాసు ఉచితంగా ఇస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. దసరా.. దీపావళి పండుగ సీజన్లలో ఈ ఆఫర్లు ఎక్కువగా రావడంతో విజిలెన్స్ అధికారులు ఈ దుకాణాలపై నజర్ వేశారు.
ఇటీవల రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాలోని 12 ప్రముఖ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా ఐదు చోట్ల ఆభరణాల బరువు అసలు కంటే తక్కువ చూపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఒక్కో దుకాణానికి గరిష్టంగా 12 లక్షల జరిమానా విధించారు. మరోవైపు కొన్ని సూపర్ మార్కెట్లు.. షాపింగ్ కాంప్లెక్స్ లు సైతం ఎమ్మార్పీ ధరల్లో దాగుడు మూతలు ఆడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఏడాది అక్టోబర్.. నవంబర్ నెలల్లో 300లకు పైగా షాపింగ్ మాల్స్.. సూపర్ మార్కెట్లపై విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. కొన్ని చోట్ల దుస్తులకు కంపెనీ ప్యాకింగ్ లేకపోవడం.. ఫ్యాంట్.. షర్టులపై ధరలు అస్పష్టంగా ఉండటాన్ని గుర్తించారు.అలాగే ఒక కిలో ఆహార పదార్థాల బరువు కిలోకు 950 నుంచి 970 గ్రాములే ఉంటుందని తనిఖీలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ మార్ట్ కు ఏకంగా 14 లక్షల జరిమానా విధించారు. రాబోయే రోజుల్లో మరిన్ని తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.