
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11:
వచ్చే ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు షార్ట్ కట్ మెదడ్స్ ని ఎన్నుకుంటున్నారు. అందుకే ఉచితాల బాట పడుతున్నారు. ఏపీలో ఈ ట్రెండ్ చాలా కాలంగా ఉన్నా ఒక లెవెల్ కి చేరింది మాత్రం ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్ధిగా ఉన్న వైఎస్సార్ తోనే. ఆయన సంక్షేమ పధకాలు అంటూ 2004లో చాలానే హామీలు ఇచ్చారు. అలా అధికారంలోకి వచ్చారు.వైఎస్సార్ వాటిని సక్రమంగా నెరవేర్చారు అంటే నాడు ఉమ్మడి ఏపీగా ఉంది. బలమైన ఆర్ధిక వ్యవస్థ ఉంది. అదే తీరున 2009లో చంద్రబాబు ఆల్ ఫ్రీ అంటూ రంగంలోకి దిగినా కాంగ్రెస్ గెలిచింది. కారణం ఎవరైనా ఉచితాలే కాదా అని కాంగ్రెస్ ని కంటిన్యూ చేశారు. 2014 నాటికి ఏపీ విభజన జరిగింది. ఏపీ అన్ని విధాలుగా గాయపడింది. లక్ష కోట్ల అప్పు నెత్తిన పెట్టి మరీ రాష్ట్రం ఏర్పడింది.
అయినా సరే తగ్గేది లే అంటూ టీడీపీ వైసీపీ హామీలు గుప్పించాయి. ఆ ఎన్నికలో టీడీపీ గెలిచింది. అయిదేళ్ళ ఏలుబడిలో బాబు కూడా కొన్ని హామీలు అమలు చేశారు. కొన్ని చివర్లో చేసి మమ అనిపించారు. దాన్ని సాకుగా తీసుకుని జగన్ అంతకు రెట్టింపు హామీలతో 2019 ఎన్నికల మ్యానిఫేస్టో రెడీ చేసి జనాల వద్దకు వెళ్ళారు.ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నవరత్నాలు అంటూ సింపుల్ గా కనిపించినా వాటిని నెరరేర్చడానికి మూడున్నరేళ్ళలో ఏపీలో అప్పులు కుప్ప అయింది. తుచ తప్పకుండా హామీలు అన్నీ అమలు చేశామని చెబుతున్నారు కానీ ఏపీ ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బ తినిపోయింది అని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. మరో పాతికేళ్ళకు వచ్చే ఆదాయాలను కూడా కలిపి కూడవేసి మరీ అప్పులు తెచ్చేసిన తరువాత ప్రభుత్వ ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టేశాక ఇక అమ్మడానికి ఏమీ లేదని అంతా అంటున్నారు.
ఇపుడు అర్జంటుగా చేయాల్సింది ఏంటి అంటే సంక్షేమ పధకాలను ఆపు చేయడం. దాని వల్ల అప్పులు ఎంతో కొంత తగ్గుతాయి. కానీ ఏపీలో రాజకీయ పార్టీల తీరు అలా ఉందా అంటే నో అనే చెప్పాలి. వైసీపీ చూస్తే తాము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ స్కీములతో పాటు మరిన్ని కొత్త స్కీంస్ కూడా ఇస్తామని చెప్పుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే పధకాలు ఏవీ కంటిన్యూ కావు అని కూడా చెబుతున్నారు.
దాంతో టీడీపీ అలెర్ట్ అయిపోయింది ఆ పార్టీ అధినేత ఆ మధ్య క్రిష్ణ జిల్లాలో మాట్లాడుతూ పధకాలు అన్నీ తాము కొనసాగిస్తామని చెప్పారు. తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్ళి మరీ ఒక భారీ హామీ ఇచ్చారు. వైసీపీ పథకాలతో పాటు తెలుగుదేశం పార్టీ కొత్త పధకాలు కూడా ఇస్తుందని బాబు గారు చెప్పుకొచ్చారు. అదే పాటను ఆయన ఏపీ అంతటా ఇపుడు చేస్తున్న జిల్లాల టూర్లలో చెబుతున్నారు. అంతే కాదు తమ పధకాలను వైసీపీ ఆపేసింది అని వాటిని వడ్డీతో సహా కొనసాగించి తీరుతామని భీషణ ప్రతిన బాబు గారు చేస్తున్నారు.లేటెస్ట్ గా జనసేన కూడా సంక్షేమ బాట పట్టింది. తాము అధికారంలోకి వస్తే ఏడాది లక్ష మంది యువతకు పది లక్షలు వంతున అయిదేళ్లలో అయిదు లక్షల మందికి ఆర్ధిక సాయం అందించి వారి చేత పరిశ్రమలు పెట్టిస్తామని అంటోంది. ఇది కూడా భారీ ఆర్ధిక పధకమే. గతంలో ఇలాంటివి ఉన్నా డబ్బు పోయింది కానీ స్వయం ఉపాధి పధకాలు అయితే నిలవలేదు. దీంతో పాటు జనసేన మరిన్ని ఉచిత వరాలను రెడీ చేసుకుంటోంది.
దీన్ని చూసిన వారు అంతా ఒక్కటే మాట అంటున్నారు. ఏపీలో అసలు ఏముందయ్యా ఖజానా సాంతం నాకేశారు కదా. అక్కడ మిగిలింది ఏదీ లేదు కదా. ఆ మాత్రం దానికి ఇన్నేసి పధకాలు తెచ్చి ఎలా అమలు చేస్తారయ్య అని అన్ని పార్టీలను ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేసి పధకాలు కొనసాగించడానికి కూడా వీలు లేకనే కదా వైసీపీ సతమతం అవుతోంది అని అంటున్నారు. ఇలా ఉచితాన్ని పీక్స్ కి చేర్చి ఏపీని అప్పుల కుప్పగా మార్చేసినా కూడా ఇంకా అంపశయ్య మీద ఉన్న ఆంధ్రా ఆర్ధికంతో రాజకీయ జూదం ఆడడమేంటి అని మండిపడుతున్నారు.ఏపీ బీజేపీ కూడా తాజాగా గుంటూర్ టూర్ లో చంద్రబాబు ఉచిత హామీల మీద మండిపడింది. అభివృద్ధి ఏపీకి వద్దా ఎంతసేపూ ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని చూడడమేనా అని ఫైర్ అయింది. గుజరాత్ లో బీజేపీ అభివృద్ధిని చూపించి అధికారం ఏడవసారి సొంతం చేసుకుంది. దాన్ని చూసి అయినా జగన్ బాబు ఏమీ నేర్చుకోలేరా అని విరుచుకుపడుతోంది. వారు అన్నారు అని కాదు కానీ ఉచిత హామీలు అంటూ ఏపీని ఇంకా చిద్రం చేసే పనులు మానక పోతే పాలించడానికి రాష్ట్రం ఉంటుందా అన్నది పెద్ద డౌట్. మరి ఆ డౌట్ రాజకీయ పార్టీలకు కలిగేంతవరకూ ఈ ఉచితాలను అంతూ పొంతూ ఉండదంతే.





