మహబూబాబాద్ ప్రతినిధి 07, డిసెంబర్ (జనసముద్రం న్యూస్):
జిల్లాలో త్వరలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన ఖరారు కానున్నందున నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, మెడికల్ కాలేజ్ పనులను వివేకవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల కలెక్టరేట్ లను మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా కలెక్టర్ కొండూరు శశాంక, జడ్పీ చైర్మన్ కుమారి ఆంగోత్ బిందు లతో కలిసి సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజ్, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించుకోబోతున్నామని ఆన్నారు. మెడికల్ కాలేజీలో ఇప్పటికే 100 మంది ఎంబిబిఎస్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజ్ తో పాటు నర్సింగ్ కాలేజ్ ను కనెక్ట్ చేస్తూ నెల్లికుదురు రోడ్డు మార్గం పనులకు సంబంధించి మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ల చొరవతో 8 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు. 560 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.62.50 కోట్లతో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ఇప్పటికే సమకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయం పనులు పూర్తయ్యాయని. పనుల పురోగతి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్షిస్తూ సమన్వయతో ముందుకు వెళ్తున్నామన్నారు. మానుకోట జిల్లాలో కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ తానేశ్వర్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్ సహకార శాఖ అధికారి కుర్షిద్ తదితర అధికారులు పాల్గొన్నారు.