జనసముద్రం న్యూస్, డిసెంబర్ 6 :
డిసెంబర్ 6న తెల్లవారుజామునే ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు విజయవాడలో వైసీపీ నేతలకు షాకిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఇళ్లలో దాడులకు దిగారు.
మంగళవారం తెల్లవారుజామున 6.30 గంటలకే దేవినేని అవినాష్ ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ భూమి వ్యవహారానికి సంబంధించి దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇదే సమయంలో ఇంకో ఐటీ అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని స్థిరాస్తి వ్యాపారి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి బావమరిది డైరెక్టర్ జనార్ధన్రెడ్డి ఇల్లు కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ విజయవాడతోపాటు నెల్లూరులోనూ ఆ సంస్థకు చెందిన సీఈవో డైరెక్టర్లు పెట్టుబడిదారుల కార్యాలయాలు ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో 20కిపైగా ఐటీ బృందాలు పాల్గొన్నాయని సమాచారం. మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
బిల్డర్స్పై తనిఖీల్లో భాగంగానే వైసీపీ నేత ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో వైసీపీ నేత దేవినేని అవినాష్కు చెందిన స్థలం డెవలప్మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన దేవినేని అవినాష్ 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా తెలంగాణలో సీబీఐ ఈడీ అధికారుల దాడులు కలకలం సృష్టించగా.. తాజాగా ఆదాయపు పన్నుశాఖ అధికారులు కూడా తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.