జనసముద్రం న్యూస్, డిసెంబర్ 5 :
వైకాపా వర్గీయులు దాడి చేయడంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పీఏ శివబాబు, మరో ముగ్గురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. పెదవేగి మండలం కొప్పాక సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తిని కలిసేందుకు శివబాబు మరికొంతమంది జీపులో పెదకడిమి గ్రామంలోని రాజా తోటకు వెళుతుండగా అలుగులగూడెం వంతెన వద్ద వైకాపా వర్గీయులు వీరి వాహనాన్ని ఆపారు. ఎక్కడికి వెళుతున్నారంటూ కర్రలు, రాడ్డులతో దాడికి దిగారు. ఈ ఘటనలో శివబాబు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివబాబు తలకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.
కాగా, కొప్పాక సమీపంలోని పోలవరం కుడికాలువ వద్ద వైకాపాకు చెందిన కొందరు జేసీబీలతో మట్టి తవ్విస్తున్నారని, ఆ సమయంలోనే తాము అటుగా వెళ్లడంతో వారిని అడ్డుకునేందుకు వెళ్తున్నామనుకుని దాడి చేశారని శివబాబు తెలిపారు. తమపై దాడి చేసిన వారిలో వైకాపాకు చెందిన కొప్పాక రంగారావు, పచ్చిపులుసు శివ, మరికొంతమంది ఉన్నారని ఆరోపించారు. బాధితులను చింతమనేని సతీమణి రాధ పరామర్శించారు.
ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో శివబాబు తదితరులు చికిత్స పొందుతున్న సమయంలోనే దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారావు, శివ, మరికొందరు వైద్యసేవల కోసం అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.