జనసముద్రం న్యూస్,డిసెంబర్1,విశాఖపట్నం,
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. గడచిన మూడు సంవత్సరాలలో పలు కొత్త కంపెనీలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరికొన్ని కంపెనీలు ఉత్పత్తికి సిద్ధంగా ఉండగా, రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆదేశాలతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి అమర్నాథ్ గురువారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో దీపక్ బగ్లాతో భేటీ అయ్యారు.
భారతదేశంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచే యాజమాన్యాలకు ఇన్వెస్ట్ ఇండియా సంస్థ మార్గదర్శకంగా నిలుస్తుంది. ఏఏ పరిశ్రమలు ఏఏ రాష్ట్రాల్లో నెలకొల్పడానికి అనువైన పరిస్థితులు ఉంటాయన్న సమాచారాన్ని ఈ ఇన్వెస్ట్ ఇండియా సంస్థ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి అమర్నాథ్ దీపక్ బగ్లాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు నెలకొల్పటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని అమర్నాథ్ ఆయనకు తెలియజేశారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే యాజమాన్యాలను తొలుత ఆంధ్రప్రదేశ్ కు పంపించాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సరళమైన పారిశ్రామిక విధానo అమల్లో ఉందని, మౌలిక సదుపాయాలతో కూడిన భూమి అందుబాటులో ఉందని, దీంతోపాటు నైపుణ్యం కలిగిన సిబ్బంది కూడా ఏపీలో పుష్కలంగా ఉన్నారని మంత్రి అమర్నాథ్, దీపక్ బగ్లాకు చెప్పారు. మంత్రి అభ్యర్థనపై దీపక్ సానుకూలంగా స్పందించారు.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మార్చి నెలలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్-2023 నిర్వహణపై కూడా మంత్రి అమర్నాథ్, దీపక్ బగ్గ తో చర్చించారు. ఈ సదస్సుకు ఏఏ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలన్నటువంటి అంశాలపై చర్చించారు.
మంత్రి అమర్నాథ్ వెంట ప్రభుత్వ విప్ ధర్మ శ్రీ, పరిశ్రమ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సృజన తదితరులు ఉన్నారు.