సంతోషం అనేది అందరికీ ఒకేలా ఉంటుందా? అంటే ఉండదనే చెప్పొచ్చు. సంతోషాన్ని ఒకరు డబ్బు రూపంలో చూస్తే.. మరొకరు సౌఖ్యాలు కలిగి ఉండటంలో చూస్తారు.. ఇంకొందరేమో మానసిక ప్రశాంతత కలిగి ఉండటమే సంతోషంగా భావిస్తుంటారు. ప్రపంచంలో కొన్ని దేశాలు సంపన్నంగా ఉంటే మరికొన్ని దేశాలు సాంకేతికపరంగా.. ఇంకొన్ని అశాంతికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
అయితే ఈ దేశాలన్నీ పక్కకు నెట్టి అతి చిన్న దేశమైన ఫ్లినాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. వరుసగా ఐదోసారి ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. యూరప్ కు చెందిన ఫిన్లాండ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకోవడంపై ఫిన్లాండ్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ-2022 జాబితా ప్రకారం ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో డెన్మార్క్ నిలిచింది
మూడో స్థానంలో ఐస్ లాండ్.. నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్.. ఐదో స్థానంలో నెదర్లాండ్స్.. ఆరో స్థానంలో లగ్జెంబర్గ్.. ఏడో స్థానంలో స్వీడన్.. ఎనిమిదో స్థానంలో నార్వే.. తొమ్మిదో స్థానంలో ఇజ్రాయెల్.. పదో స్థానంలో న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. అగ్ర దేశాలైన కెనడా 15.. అమెరికా 16.. బ్రిటన్ కు 17వ స్థానంలో నిలిచాయి.
అయితే ఈ జాబితాలో మన దేశం మాత్రం కింది నుంచి పదో స్థానంలో నిలిచింది. మొత్తం 146 దేశాల్లో వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ సర్వే నిర్వహించగా భారత్ 136వ స్థానంలో ఉండటం గమనార్హం. గతంతో పొలిస్తే భారత్ కాస్త మెరుగుపడటం కొసమెరుపు. ఇక మన పొరుగున ఉన్న పాకిస్తాన్.. బంగ్లాదేశ్.. శ్రీలంక మనకంటే చాలా బెటర్ గా ఉండటం గమనార్హం.
వరల్డ్ హ్యాపీయెస్ట్ 2022 నివేదికలో పాకిస్తాన్ 103వ స్థానంలో కొనసాగుతోంది. ఇక బంగ్లాదేశ్ 99 స్థానంలో శ్రీలంక 126 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. గతంతో పొలిస్తే మన పొరుగు దేశాలు సైతం సంతోష సూచీలో ఎంతో మెరుగుపడ్డాయి. ఇక అత్యంత అశాంతి కలిగిన దేశంగా ఆఫ్ఘనిస్తాన్ (146) నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ కంటే ముందు లెబనాన్.. జింబాబ్వే దేశాలున్నాయి.