-బోనకల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.మధుబాబు
బోనకల్, మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా, జనసముద్రం న్యూస్, సెప్టెంబర్ 20:- పిల్లల యొక్క మానసిక శారీరక అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని గురువారం బోనకల్ మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే. మధుబాబు, విద్యాశాఖ నోడల్ అధికారి దామాలా పుల్లయ్య అన్నారు. చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్థ సహకారం తో ఎఫర్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల మండల స్థాయి క్రీడా కార్యక్రమాలను స్థానిక చిరునోముల హైస్కూల్ నందు వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మధుబాబు మాట్లాడుతూ… పిల్లలకు చదువుతోపాటు క్రీడా శిక్షణ ఎంతో అవసరమని ఈ క్రీడలలో నిరంతరం సాధన చేస్తున్నట్లయితే పిల్లలు శారీరకంగా బలవంతులుగా తయారయ్యి దాని ద్వారా మానసిక అభివృద్ధి చెందుతుందని తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలలో ముందుండే అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. మరో ముఖ్య అతిథి పుల్లయ్య మాట్లాడుతూ… తమ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల యందు బోధనతోపాటు ప్రతిరోజు క్రీడల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి బాల బాలికలకు వేర్వేరుగా క్రీడా నైపుణ్యాలు నేర్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఈ మండల స్థాయి క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎఫర్ట్ సంస్థను అభినందించారు. ఎఫర్ట్ సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ… తమ సంస్థ బోనకల్ మండలంలో అన్ని గ్రామాలలో బాలల హక్కుల కొరకు కృషి చేస్తున్నదని దానిలో భాగంగానే పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి కోసం ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం వరుసగా ఇది మూడవ సంవత్సరము అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు బాలికలకు, రెండవ రోజు బాలురకు కబడ్డీ, ఖో ఖో , వాలీబాల్, షాట్ పుట్, లాంగ్ జంప్ పోటీలు జూనియర్ మరియు సీనియర్ విభాగాల వారీగా నిర్వహించి ప్రధమ, ద్వితీయ బహుమతులతో పాటుగా ప్రతి ఒక్కరికి మెడల్స్ అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని లు, టీచర్లు, సంస్థ సిబ్బంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు, సెంటర్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.