కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ ముహూర్తం పెట్టేశారు అని ఢిల్లీ వర్గాల భోగట్టా. సంక్రాంతి తరువాత వచ్చే మాఘమాసంలో ఈ విస్తరణ ఉండొచ్చు అని అంటున్నారు. అంటే జనవరి నాలుగవ వారంలో అని చెబుతున్నారు. 2024 ఎన్నికల కోసం పనిమంతులను తీసుకోవాలని సమర్ధులకు చోటివ్వాలని మోడీ ఈసారి విస్తరణను జరుపుతున్నారని అంటున్నారు. అదే విధంగా 2023లో కీలక రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. వాటిని టార్గెట్ చేస్తూ కచ్చితంగా గెలుచుకునేలా మోడీ మార్క్ క్యాబినెట్ కూర్పు ఉంటుంది అని అంటున్నారు.
ఇక చూస్తే 2023లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ చత్తీస్ ఘడ్త్తీ కర్నాటక తెలనగణా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో రెండింట్లో బీజేపీ పవర్ లో ఉంది. అయితే మధ్యప్రదేశ్ కానీ కర్నాటక కానీ బీజేపీకి ఓటెత్తి జనాలు తీర్పు ఇవ్వలేదు. ఇక్కడ విపక్షం నుంచి ఎమ్మెల్యేలను చీల్చి వారిని బీజేపీలో చేర్చుకుని ఎన్నికలు పెట్టి గెలుచుకునే బీజేపీ అధికారంలోకి వచ్చింది.
మళ్లీ ఇక్కడ గెలవాలని బీజేపీ అనుకుంటోంది. అలాగే చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ పవర్ లో ఉంది. తెలంగాణాలో టీయారెస్ ఉంది. కర్నాటకలో బీజేపీకి టఫ్ ఫైట్ కాంగ్రెస్ నుంచి ఉంది. దాంతో కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన మార్పులు చేయడానికి మోడీ చూస్తున్నారుట. అలాగే ఈసారి జరిగే విస్తరణ చివరిదిగా ఉండవచ్చు అని అంటున్నారు.
మరో ఏణ్ణర్ధంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందువల్ల ఇదే చివరి అవకాశం ఎంపీలకు అని అంటున్నారు. ఇక మధ్యప్రదేశ్ కర్నాటక రాజస్థాన్ లలో ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడ ఎంపీలకు మంత్రి పదవులు కట్టబెట్టాలని మోడీ చూస్తున్నారని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల మీద మోడీ కన్ను ఉంది. దాంతో తెలంగాణాలో కూడా బీసీ మంత్రిని తీసుకోవాలనుకుంటున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి దక్కుతుంది అని తెలుస్తోంది.
ఇక్కడ ఒక ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ కనుక సరేనంటే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రుడిగా ఉన్నారు. ఆయన కోరుకుంటే రాజ్యసభ సీటు ఇచ్చి మరీ కేంద్ర మంత్రి పదవిని కట్టబెడతారు ఆ విధంగా ఏపీలో జనసేనను తమ వైపు ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో రాజకీయాన్ని తమకు అనుకూలంగా చేసుకోవాలి బీజేపీ అని చూస్తోంది అని అంటున్నారు.
పవన్ కనుక నో అంటే అపుడు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరితో పాటు సీఎం రమేష్ జీవీఎల్ నరసింహారావు వంటి వారి పేర్లు పరిశీలనలోకి వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విడతలో ఏపీ నుంచి ఒకరికి కేంద్రంలో బెర్త్ ఖాయమని అంటున్నారు. అలాగే తెలంగాణాలో చూసుకుంటే ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న బండి సంజయ్ కి కేంద్ర మంత్రి మండలిలో చోటు కల్పిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి మోడీ మార్క్ విస్తరణతో ఎవరి విస్తరి నిండుతుందో ఎవరి చోటు ఖాళీ అవుతుందో.