జనసముద్రం న్యూస్, వైఎస్సార్ జిల్లా, డిసెంబర్ 15 :
వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ జిల్లాలో గత ఎన్నికల్లో ఆ పార్టీ 10కి 10 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో సైతం 9 స్థానాలను గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు సాధించాలనే కృతనిశ్చయంతో ఉంది.
అయితే కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్యే విభేదాలు అసమ్మతి వైసీపీ కొంప ముంచే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని అంటున్నారు. పట్టణంలోని నాయకులంతా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వైపు రెండు వర్గాలుగా విడిపోయారని టాక్ నడుస్తోంది.
రానున్న ఎన్నికల్లో సీటు తనకే వస్తుందని తానే ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నానని రమేష్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా పట్టణంలోని కౌన్సిలర్లు మొత్తం రెండు గ్రూపుల్లో చేరడంతో అభివృద్ధి కార్యక్రమాలు అటక ఎక్కాయని అంటున్నారు.ఈ పరిస్థితుల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ అన్న ప్రసాద్ యాదవ్ ఇంటిపై డిసెంబర్ 14న రాత్రి దాడి జరిగింది. ఇప్పుడీ ఈ వ్యవహారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ సోదరుడి ఇంటిపై దాడి చేసే ధైర్యం వైసీపీ నేతలకు తప్ప ప్రతిపక్షాలకు ఉంటుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అందులోనూ సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతలను టచ్ చేసే ధైర్యం ప్రతిపక్ష నేతలు చేసే చాన్సే లేదు. ఈ నేపథ్యంలో అనుమానాలన్నీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరులపైకే వెళ్తున్నాయని చెబుతున్నారు.
కాగా బీసీ కోటా కింద రమేశ్ యాదవ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పటి నుంచి ప్రొద్దుటూరులో అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని చెబుతున్నారు. గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గాలు గొడవ పడటంతో ముగ్గురు సీఐలు నలుగురు ఎస్సైలు భారీ సంఖ్యలో కానిస్టేబుళ్లు ఇరు వర్గాలకు నచ్చజెప్పిన పరిస్థితులు ఎదురయ్యాయని గుర్తు చేస్తున్నారు.
గతంలో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ కు కొంతమంది ఫోన్ చేసి చంపుతామని బెదిరించారు. దీంతో తనకు ప్రాణహాని వుందని నిందితులెవరో పట్టుకోవాలని ప్రొద్దుటూరు పోలీసులకు రమేశ్ యాదవ్ అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఇంత వరకూ ఆ బెదిరింపు ఫోన్ కాల్ అంశమే తేల్చలేదు. దీన్నిబట్టి ఆ ఫోన్ కాల్ వెనుక బడా నేతలున్నారని అర్థం చేసుకోవచ్చని రమేశ్ యాదవే అప్పట్లో వ్యాఖ్యానించారు.
అలాగే రమేశ్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రొద్దుటూరులో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని అప్పటికప్పుడే చింపేశారు. బ్యానర్లు కడుతున్న ఎమ్మెల్సీ రమేష్ అనుచరులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారని వార్తలు వచ్చాయి.తాజాగా ఎమ్మెల్సీ సోదరుడు ప్రసాద్ యాదవ్ ఇంటిపై అర్ధరాత్రి కట్టెలు కత్తులతో కొందరు దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. దాడికి ముందు కొందరు మద్యం మత్తులో ఎమ్మెల్సీ సోదరుడికి ఫోన్ చేసి బూతులు తిట్టారని తెలుస్తోంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ సోదరుడి ఇంటికి వచ్చి కట్టెలు కత్తులతో దాడికి దిగడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్న ప్రసాద్ యాదవ్ ఇంట్లోనే ఉండటం గమనార్హం.
అయితే దాడికి వచ్చిన వ్యక్తులను రమేష్ అనుచరులు నిలువరించారు. ఈ దాడిలో ప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబ సభ్యులకు ఏమీ కాలేదు.ఈ సమాచారం అందిన వెంటనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అక్కడికి వెళ్లి తన అన్నను పరామర్శించి వచ్చారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.