జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 :
కరోనా సమయంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు ఐటీ కంపెనీలన్నీ మొగ్గుచూపారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించి నెలనెలా జీతాలను సైతం చెల్లించాయి. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత అమెరికాకు చెందిన బడా ఐటీ కంపెనీలన్నీ వరుసబెట్టి ఉద్యోగులకు ఇంటికి పంపిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశం గా మారుతోంది.
ఇప్పటికే న్యూయార్క్ వ్యాలీలోని బడా ఐటీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఇంటికి పంపించాయి. దిగ్గజ కంపెనీలైన మెటా.. అమెజాన్.. ట్విట్టర్.. ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థలు హెచ్పీ.. డెల్ కంపెనీలు ఉన్నాయి. రాబోయే కాలంలోనూ మరింత మరింత మందికి ఉద్వాసన తప్పదనే సంకేతాలను సైతం ఇవ్వడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
అయితే కొన్ని రోజులుగా ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతకు విరామం ఇచ్చాయని భావించేలోగా టెక్ దిగ్గజం సేల్స్ ఫోర్స్.. నెట్ వర్కింగ్ దిగ్గం సిస్కో.. గూగుల్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కోతకు సిద్ధమయ్యాయి. సేల్స్ ఫోర్స్ కంపెనీ ఇటీవలే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో కంపెనీ వైస్ చైర్మన్.. సీఈవో అయిన బ్రెట్ టేలర్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.ఆయన స్థానంలో కంపెనీ సహ వ్యవస్థాపకుడు మార్క్ బెనియోఫ్ కొత్త చైర్మన్.. సీఈవోగా నియమితులయ్యారు. ఈక్రమంలోనే అమెరికన్ క్లౌడ్ ఆధారిత సేల్స్ఫోర్స్ కొత్త మేనేజ్మెంట్ కంపెనీలోని ఉద్యోగాల్లో కోతకు విధించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సేల్స్ ఫోర్స్ లో మార్పుల కారణంగా కంపెనీ షేర్ విలువ సైతం పడిపోయింది.
దీంతో కంపెనీ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గతేడాది డిసెంబర్ 13న కంపెనీ స్టాక్ 265.76 డాలర్ల వద్ద ట్రేడ్ కాగా ప్రస్తుతం ధర 49.91 శాతం క్రాష్ అయి మునుపటి ట్రేడింగ్ సెషన్లో 133.11 డాలర్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ నవంబర్లో 2500 మందిని తొలగించినట్లు ప్రోటోకాల్ నివేదించింది. అయితే 1000 కంటే తక్కువ మందిని మాత్రమే తొలగించినట్లు వెల్లడించింది.
అలాగే టెక్ జెయింట్ గూగుల్ సైతం 2023 సంవత్సరంలో భారీగా ఉద్యోగులను తొలగించవచ్చని తెలుస్తోంది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ రాబోయే వారాల్లో సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే ప్రముఖ నెట్ వర్కింగ్ దిగ్గజం సిస్కో 4వేల మంది ఉద్యోగులపై వేటు అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ లో పలు కంపెనీలు ఇదే బాట పట్టే అవకాశం ఉండటంతో టెక్కీలు ఆందోళన చెందుతున్నారు.