జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 :
ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులతో పాటు యావత్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్ లలో ఒకడైన రికీ పాంటింగ్ గుండె పోటుకు గురయ్యారు. అది కూడా మ్యాచ్ కామెంట్రీలో ఉండగానే జరిగింది. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆస్ట్రేలియా – వెస్టిండీస్ మధ్య పెర్త్ లో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు శుక్రవారం ఉదయం జరిగింది.లంచ్ వరకు కామెంట్రీలోఆసీస్-విండీస్ టెస్టు మ్యాచ్ లో లంచ్ వరకు కామెంట్రీలో కనిపించిన పాంటింగ్ అనూహ్యంగా అసౌకర్యానికి గురయ్యారు. చానల్ సెవెన్ నెట్ వర్క్ తరఫున కామెంట్రీ చేస్తున్న 47 ఏళ్ల పాంటింగ్ పరిస్థితిని గమనించిన సహచర కామెంటేటర్లు అప్రమత్తమయ్యారు.
కాగా పాంటింగ్ అస్వస్థతను ప్రస్తావిస్తూ ”ఈ రోజు మిగతా ఆట సమయంలో పాంటింగ్ కామెంట్రీ చేయలేరు” అంటూ చానెల్ 7 పేర్కొంది. పరిస్థితుల రీత్యా చూస్తే పాంటింగ్ శనివారం కూడా కామెంట్రీకి వచ్చే అవకాశం లేదు.
ఆల్ టైమ్ దిగ్గజం పాంటింగ్ ఆసీస్ క్రికెట్ ఆల్ టైమ్ దిగ్గజం. 1995 నుంచి 2012 వరకు 168 టెస్టులాడాడు. 77 టెస్టుల్లో కెప్టెన్సీ వహించాడు. ఇందులో 48 విజయాలున్నాయి. మొత్తమ్మీద 13378 పరుగులు సాధించాడు. 51.85 అతడి సగటు. 41 సెంచరీలు 62 అర్ధ సెంచరీలు సాధించాడు. కాగా ఆసీస్ క్రికెటర్ల వన్డేలు తక్కువగా ఆడతారు.
కానీ పాంటింగ్ మాత్రం 375 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 13704 పరుగులు చేశాడు. 42.03 యావరేజీతో 30 సెంచరీలు 82 అర్ధ సెంచరీలు కొట్టాడు. 17 టి20ల్లోనూ దేశానికి ఆడాడు. 401 పరుగులు చేశాడు. అన్నిటికి మించి.. 1999 2003 2007 వన్డే ప్రపంచ కప్ లు గెలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడు.
వీటిలో 2003లో భారత్ పై ఫైనల్లో అతడు ఆడిన ఇన్నింగ్స్ అత్యంత విధ్వంసకరం. నాడు 2007లో ఆసీస్ జట్టుకు పాంటింగే కెప్టెన్. రిటైరయ్యాక పాంటింగ్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కు బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు.