జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 :
ఎంత తోపు అయినా.. వ్యక్తిగత హోదాలో.. కుటుంబ సభ్యుల కోసం ఒకరోజులో ఎన్ని ఎకరాల భూమి కొనే వీలుంది? అంటే.. ఐదు పది.. పాతిక అని చెబుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోరెండు తెలుగు రాష్ట్రాల్లో భూముల ధరలు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇంతకు మించి కొనుగోలు చేసే అవకాశం లేదు. అయితే.. ఈ అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో ఏపీ మంత్రి ఒకరు వ్యవహరించిన వైనం తాజగా వెలుగు చూసింది. ఒకే రోజులో తన కుటుంబ సభ్యుల కోసం 180 ఎకరాల్ని కొనుగోలు చేసిన ఏపీ కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా ఐటీ శాఖ వారికి నోటీసులు ఇవ్వటం గమనార్హం. ఒకే రోజులో ఇంత భారీగా భూమిని కొనుగోలు చేసిన ఉదంతంలో మంంత్రి సతీమణి రేణుకమ్మ.. ఆమె బంధువులు త్రివేణి.. ఉమాదేవి.. సన్నిహితుడైన అనంత పద్మనాభరావు పేరుతో రిజిష్ట్రేషన్ చేసిన వైనాన్ని మంత్రి వివరణ రూపంలో వెల్లడించినా.. ఒకే రోజులో ఇంత భారీగా భూమిని కొనుగోలు చేయటానికి ఉన్న అవకాశాలు ఏమిటి? నిధుల లభ్యత ఎలా సాధ్యమైందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన వివరాల్ని చూస్తే.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పరిధిలోని 30.83 ఎకరాల భూమిని 2020 మార్చి రెండున మంత్రి సతీమణి రేణుకమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది.అదే రోజు మంత్రికి సంబంధించిన బంధువులు.. కుటుంబ సభ్యుల పేరుతో 180 ఎకరాలకొనుగోళ్లు చేసినట్లుగా గుర్తించారు.
ఒక మంత్రి సతీమణి రేణుకమ్మ అయితే.. తనకున్న ఆదాయ వనరుల్నిచూపించకుండా ఇంత భారీగా భూమిని ఎలా కొనుగోలు చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎలాంటి ఆదాయం లేకుండా రూ.52.42 లక్షలతోఇంత భూమిని ఎలా కొన్నారన్నది ఐటీ శాఖ అభ్యంతరం. దీనికి సంబంధించి తాజాగా నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ.. తాము ఇచ్చిన నోటీసులకు 90 రోజుల్లో సమాధానం ఇవ్వాలనని కోరారు.ఇంత భారీగా మంత్రి.. వారి బంధువులు ఒకే రోజున ఇంతలా కొనేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లో ఈ ఉదంతానికి సంబంధించిన మరిన్ని సంచలనాలు బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.