జనసముద్రంన్యూస్, మే 31, వెల్దుర్తి ;
ముగ్గురు నాయకులు కలిసి ఆంధ్రులకు ఒక స్థిరమైన, శాశ్వత రాజధానిని ఏర్పాటు చేయండి. ఐదేళ్లకు ఒకసారి మారే రాజధాని మాకు అవసరం లేదు. ప్రజలను ప్రయోగాల కోసమే అనుకోవడం మానేయండి!
మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఆంధ్రులు త్యాగం చేశారు. తెలంగాణతో కలిసినప్పుడు కూడా, “తెలుగు వారందరం కలిసి ఉండాలి” అని ఆశించి హైదరాబాద్‌ను రాజధానిగా అంగీకరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు విడిపోయి 11 ఏళ్లు అవుతున్నా, ఇప్పటికీ మనకు ఒక స్పష్టమైన రాజధాని లేదు. ఇది ఎంత నిరాశకరం, ఎంత అవమానకరం తెలుసా?
ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాజధానిని తమ రాజకీయం కోసం మార్చడం దారుణం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవడం మానండి. ఒకే చోట ఒక శాశ్వత రాజధానిని నిర్మించండి — అది రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, రహదారి, రైలు, ఇతర వనరులకి అందుబాటులో ఉండాలి. ఇది ఎవరూ మార్చలేని విధంగా చట్టబద్ధతతో, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక సంవత్సరంలోనే నిర్మించాలి.
హైదరాబాద్‌ను కోల్పోయిన తర్వాత మాకు భవిష్యత్ ఆందోళనగా మారింది. ఇంకెంతకాలం ఈ అస్థిరత? ఇకపై ఆంధ్రులకు మరో నిరాశను మిగిలించకండి
అని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మండల కేంద్రమైన వెల్దుర్తి కి చెందిన జూలకంటి వెంకట పుల్లారెడ్డి మరియు దుర్గెంపూడి నరేంద్ర రెడ్డి అన్నారు.





