జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12.
మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం డిమాండ్ చేశారు. మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలను సమాజానికి తెలియజేయవలసిన గురుతర బాధ్యత మీడియాపై ఉందన్నారు. సెలబ్రిటీల విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి ప్రజల్లో ఉంటుందన్నారు. అందులో భాగంగానే విధులు నిర్వర్తించడానికి వెళ్లిన టీవీ9 ప్రతినిధి పై మోహన్ బాబు విచక్షణారహితంగా దాడికి పాల్పడడం అమానుషమని దాన్ని తీవ్రంగా ఖండించారు. దాడి దృశ్యాలు చూస్తుంటే మోహన్ బాబు విచక్షణ కోల్పోయి మీడియా ప్రతినిధి పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో స్పష్టంగా తెలుస్తుంది అన్నారు. వాటిని పరిగణలోకి తీసుకొని తక్షణమే మోహన్ బాబు ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తదుపరి మాచర్ల బస్టాండ్ నుండి సాగర్ రింగ్ రోడ్డు వరకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ లో నియోజకవర్గం లోని మాచర్ల టౌన్ రిపోర్టర్ లు, రూరల్ రిపోర్టర్ లు, మండలాలకు చెందిన రిపోర్టర్ లు పాల్గొన్నారు.