రైతులు ఇబ్బందులలో ఉంటే భారం మోపడం ఏంటి?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
రాయచోటి- జనసముద్రం దినపత్రిక అక్టోబర్, 26
ఉచిత పంటల బీమాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అంటూ గతంలోనే వ్యాఖ్యానించిన చంద్రబాబు రైతు వ్యతిరేఖ విధానాలనే కొనసాగిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. అన్నదాతలపై పైసా భారం పడకుండా జగన్ ప్రభుత్వం ఐదేళ్లూ విజయవంతంగా అమలు చేసిన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కు తాజాగా మంగళం పాడారన్నారు.ఈ పథకం ఎత్తివేసే కుట్రలో భాగంగా పంటల బీమాపై అధ్యయనం కోసం చంద్రబాబు ప్రభుత్వం పౌరసరఫరాలు, ఆర్థిక శాఖ మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ వేసిందని,ప్రభుత్వ సూచన మేరకు ఈ సబ్ కమిటీ రైతులకు వ్యతిరేఖంగా నివేదికను సమర్పించిందన్నారు.ఈ పథకం స్థానంలో 2019 కి ముందున్న రైతుల భాగస్వామ్యంతో అమలైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయనున్నారన్నారు.
అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలు పూర్తయినా రైతుకు ఎలాంటి సాయం అందించలేదన్నారు. ఈ అక్టోబర్ నుంచి మొదలైన రబీ పంటలకు ,రాబోయే సీజన్ లో పెట్టే పంటలకూ సంబంధించి అన్నదాతలపై బీమా ప్రీమియం భారం మోపారన్నారు.గత ఐదేళ్లూ వైఎస్ జగన్ ప్రభుత్వం లో ఉచిత పంటల బీమా అమలుతో పాటు పెద్ద ఎత్తున పరిహారం తీసుకుంటూ, ఏ సీజన్ లో పంట దెబ్బతింటే ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందుకుంటూ ప్రశాంతంగా ఉన్న రైతుల నెత్తిన ఒక్కసారిగా పిడుగు వేశారన్నారు.ఇక నుంచి ప్రీమియం కడితే తప్ప బీమా వర్తించదని ఈ ప్రభుత్వం తేల్చి చెప్పిందన్నారు.
వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం దేశంలోనే బెస్ట్ క్రాప్ ఇన్స్యూరెన్స్ పథకం …
వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం దేశంలోనే బెస్ట్ క్రాప్ ఇన్స్యూరెన్స్ పథకంగా గతంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి,ఏపీ తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా అమలుచేయాలని సూచిందన్నారు. ఇన్నోవేషన్ కేటగిరీ క్రింద 2023లో అవార్డును సైతం జగన్ ప్రభుత్వం పొందిందన్నారు. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా అప్పటి జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేసిందన్నారు.రైతు సాగుచేసిన ప్రతి పంటకూ యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ రైతులపై పైసా భారం పడకుండా 2019 రబీ నుంచి ఉచిత పంటల బీమాను అమలు చేస్తూ వచ్చిందన్నారు. మన రాష్ట్ర స్పూర్తితో నోటిఫై చేసిన పంటలకూ యూనివర్సల్ కవరేజ్ కల్పించేందుకు ఫసల్ బీమాలో కూడా పలు మార్పులు చేశారన్నారు. ఇలాంటి మంచి పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేయడం దుర్మార్గమన్నారు.
పెట్టుబడి సాయాన్ని త్వరితగతిన చెల్లించాలి…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలైనా రైతులకు పెట్టుబడి సాయం అందించడం లేదన్నారు.సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ 20 వేలు అందిస్తామంటూ ఎన్నికల సమయంలో ఊదర గొట్టిన టిడిపి అధినేత చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.దీంతో పెట్టుబడుల కోసం రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పాలనలో వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేశారన్నారు.
ఉచిత పంటల బీమా పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి…
రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఖచ్చితంగా అమలుచేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.రైతులే ప్రీమియం చెల్లించాలన్న పద్దతిలో పంటల బీమా అమలు చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఖండించారు.జగన్ హయాంలో రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే బీమా సదుపాయం పొందేవారన్నారు.ఎన్నికల సమయంలో రైతులకు చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పారన్నారు.రైతుల సంక్షేమం మాటల్లో తప్ప చేతల్లో లేదన్న విషయం మారోమారు నిర్దారణ అయిందన్నారు. పెరిగిన పంటల పెట్టుబడి ఖర్చులకు తోడు బీమా ప్రీమియం రైతులకు తలకు మించిన భారమవుతుందని శ్రీకాంత్ రెడ్డి వివరించారు.