—-చదివేది పదో తరగతి చేసేది డాక్టర్ పని
—-పట్టించుకోని డీ ఏం అండ్ హెచ్ ఓ, పోలీస్ శాఖలు.
జనసముద్రంన్యూస్:లక్షెటిపేట: సెప్టెంబర్ 25:
ఆర్ ఏం పీ ల అచ్చిరాని వైద్యంతో అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలోని కొందరు ఆర్ ఏం పీ లు నిబంధనలు అతిక్రమించి స్థాయిని దాటి వైద్యం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా మండలంలోని కొత్త కొమ్ముగూడెం కు చెందిన బత్తుల మధుకర్ (20)మృతికి శ్రీనివాస్ అనే ఆర్ ఏం పీ కారణమైనట్లు మృతుని బంధువులు ఆరోపిస్తూ, జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 18న మధుకర్ కు నీరసంగా ఉండడంతో స్థానిక ఆర్‌ఎంపీ బొడ్డు శ్రీనివాస్ ను పిలవగా ఇంటికి వచ్చి ఇతడికి సెలైన్స్ ఎక్కించాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు సరేనన్నారు. సెలైన్ లో ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వణుకు రావడంతో ఆర్ఎంపీ వద్దకు అతని సోదరుడు వెళ్లి చెప్పగా మధుకర్ పరిస్థితి సీరియస్ గా ఉందని అతడు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్ల వెళ్ళమన్నాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి అక్కడి వైద్యుడు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలపడంతో ఎమ్మారై చేయించగా స్థానికంగా ఎవరితోనైనా వైద్యం చేయించారా? అని డాక్టర్ అడగగా అవును చేయించామని చెప్పడం జరిగిందన్నారు. దీంతో ఆ డాక్టర్ ఆర్.ఎం.పీ చేసిన వైద్యం వల్లనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యిందన్నారు. అక్కడి నుంచి కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్‌ను సంప్రదించగా ఇన్‌ఫెక్షన్ సోకిందన్నారు. దీంతో వెంటనే హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించమని చెప్పడంతో అక్కడినుండి హైదరాబాదుకు తరలించడంతో మూడు రోజులు అనంతరం చివరకు మధుకర్ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడన్నారు.
వివాదాస్పదంగా ఆర్ ఏం పీ ల వైద్యం….
మండలంలో గత నెల రోజుల క్రిందట జరిగిన ఓ ఆర్ఎంపీ ఉదoతం మరువకముందే మరో ఆర్ఎంపీ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచాడు. ఇటీవల హజీపూర్, ఇటిక్యాల, లక్షేట్టిపేట పట్టణంతో పాటు కొత్త కొమ్ముగూడెం సంఘటనలు ఆర్ ఏం పీ ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పొగొడుతున్నాయి. సైలైన్స్ పెట్టడం, ఆంటీ బయోటిక్స్ రాయడం ఆర్ ఏం పీ లకు మామూలు విషయంగా మారింది. చదివింది పదో తరగతి చేసేది ఏం బీ బీ ఎస్ లాగా వైద్యం కావడంతో రోగుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది.
పట్టించుకోని డీ ఏం అండ్ హెచ్ ఓ, పోలీసులు….
ఆర్ ఏం పీ ల వైద్యంతో రోగులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న లేదా మరణిస్తున్న వైద్య, పోలీసు శాఖలు సక్రమంగా స్పందించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. క్రిమినల్ కేసులు పెట్టి క్లినిక్ లను సీజ్ చేయాల్సిన వారు ‘మాములుగా’ తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఇకనైనా వైద్యాధికారులు, పోలీస్ శాఖ మేల్కొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.