ఏడు ఎర్రచందనం దుంగలతో పాటు 2మోటారు సైకిళ్లు స్వాధీనం
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూలై 23 జనసముద్రం న్యూస్:
అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కావలిపల్లి రాయవరం సెక్షన్ వద్ద మామిడి తోటలో 7ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచన మేరకు ఆర్ఐ (ఆపరేషన్స్) సురేష్ కుమార్ రెడ్డి కి చెందిన ఆర్ఎస్ఐ కే.సురేష్ బాబుకు చెందిన టీమ్ ఆదివారం రాత్రి నుంచి అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని సానిపాయ రేంజ్ లోని రాయవరం నుంచి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుంటూ వెళ్లారు. సోమవారం తెల్లవారు జామున రెడ్డివారిపల్లి – మాచిరెడ్డిగారి పల్లి రోడ్డుకు తూర్పు వైపున ఉన్న మామిడి తోట వద్దకు చేరుకున్నారు. అక్కడ మూడు మోటారు సైకిళ్లపై కొందరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారిని చుట్టుముట్టగా, ఒక వ్యక్తి ఒక మోటారు సైకిల్ లో పారిపోయాడు. మిగిలిన ముగ్గురుని పట్టుకుని విచారించి, సమీపంలో ఎర్రచందనం దుంగలు కల డంప్ ను కనుగొన్నారు. అక్కడ ఏడు ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అన్నమయ్య జిల్లా జిల్లేళ్లమంద పంచాయితీకి చెందిన జీ.సురేష్ (34), జీ అశోక్ (28), మాచిరెడ్డిపల్లికి చెందిన పందిపాటి తిరుమలయ్య ఉన్నారు. వీరిని అరెస్టు చేసి,. తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో అటవీ శాఖకు చెందిన సిబ్బంది కూడా పాల్గొన్నారు.