కొన్నిసార్లు కటువుగా ఉన్నా నిజం చెప్పక తప్పదు.. నిష్టూరంగా ఉన్నా వాస్తవం వెల్లడించక తప్పదు.. అలాంటి పరిస్థితే టైటాన్ సబ్ మెరైన్ విషయంలో ఎదురవుతోంది. అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన మహా నౌక టైటానిక్ శకలాల ను చూసేందుకు కెనడా లోని న్యూఫౌండ్ ల్యాండ్ నుంచి ఆదివారం బయల్దేరిన ఈ జలాంతర్గామి లోని ఐదుగురు ప్రయాణికుల ప్రాణాలు దక్కడం దేవుడి చేతి లోనే ఉందన్న సంగతి స్పష్టమవుతోంది.
భారీ గాలింపు.. అయినా కష్టమే?
పాకిస్థాన్ అపర కుబేరుడు షెహజాదా ఆయన కుమారుడు సహా ఐదుగురి తో బయల్దేరిన టైటాన్ జలాంతర్గామి తమకు సహాయకారిగా వచ్చిన నౌకతో సంబంధాలు కోల్పోయి మూడు రోజులు దాటింది. వాస్తవానికి దీని లో 90 గంటల (నాలుగు రోజులకు 6 గంటలు తక్కువ)కు సరిపడా ఆక్సిజన్ ఉంది. గల్లం తైన సమయానికి (సోమవారం మధ్యాహ్నం) 70 గంటల కు సరిపడా ఆక్సిజన్ మిగిలింది. ఈ లెక్కన చూసుకుంటే గురువారం మధ్యాహ్నానికి ప్రాణ వాయువు నిల్వలు నిండుకున్నట్లే. లేదా మరికొద్ది గంటల కు సరిపడా మాత్రమే ఉన్నట్లు. మరి అందు లోని ఐదుగురూ పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48) ఆయన కుమారుడు సులేమాన్ (19) యూఏఈ లో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ ఈ యాత్ర నిర్వాహకుడు ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ సురక్షితంగా బయట కు రావాల ని దేవుడి ని కోరుకోవాలి.
ఓ రాష్ట్రానికి మూడు రెట్ల విస్తీర్ణంలో..
టైటానిక్ మునిగిన ప్రదేశం కోసం అమెరికా కెనడా సైనిక విమానాలు సహా ప్రైవేటు మెరైన్ ఏజెన్సీలూ గాలింపు చేపట్టాయి. కానీ టైటానిక్ మునిగిన చోటు సముద్ర గర్భంలో 12 వేల అడుగుల లో తున ఉంది. దీంతో జాడ కనిపెట్టడం కష్టమే. అందుకని అమెరికా లోని కనెక్టికట్ రాష్ట్రం విస్తీర్ణానికి మూడు రెట్ల విస్తీర్ణం ఉన్న ప్రదేశం లో గాలింపు సాగుతోంది. ఇక రెండున్నర మైళ్ల లోతుకు వెళ్లి మరీ శోధిస్తున్నారు. టైటాన్ గల్లంతైన చోటుకు మరిన్ని ఓడల ను తరలించారు. కాగా గాలింపు చర్యలు చేపడుతున్న కెనడా కు చెందిన పీ-8 నిఘా విమానం.. నీటి అడుగు నుంచి వస్తున్న 30 నిమిషాలకోసారి వస్తున్న శబ్దాల ను గుర్తించింది. ఇవి జలాంతర్గామి నుంచేనని భావించింది. ఈ సమాచారాన్ని అమెరికా నావికాదళంతోనూ పంచుకుంది. ఈ డేటా ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గాలింపులో ఇబ్బందులు..
అంత లో తున టైటాన్ మునిగిన ప్రదేశాన్ని గుర్తించడం.. రెస్య్కూ పరికరాలతో దాని వద్దకు వెళ్లడం అలానే పైకి తీసుకురావడం అనేవి పెద్ద సమస్యలుగా మారాయి. వాస్తవానికి ఇదంతా ఆక్సిజన్ అయిపోకముందే జరగాలి. ఇప్పటికే మూడు రోజులు అయినందున మరో వైపు టైటాన్ లో భద్రతా ప్రమాణాల గురించి చర్చ కూడా సాగుతోంది.
అననుకూల పరిస్థితుల్లో బయల్దేరిందా?
వాస్తవానికి ఇటీవల కెనడా లో వాతావరణ పరిస్థితులు బాగోలేదు. కార్చిచ్చు కారణంగా వేలాది ఎకరాల్లో అడవులు దగ్ధం అయ్యాయి. దీనితో సంబంధ లేకున్నా.. న్యూ ఫౌండ్ లాండ్ నుంచి టైటాన్ బయల్దేరిన సమయం మాత్రం సరైనది కాదనే వాదన ఉంది. “40 ఏళ్లలో ఎన్నడూ లేనంత చల్లటి వాతావరణంలో బయల్దేరుతున్నాం” అంటూ హమీష్ హార్డింగ్ ప్రయాణానికి కొద్ది సేపటి ముందు పేర్కొనడమే దీనికి నిదర్శనం. ఇక టైటాన్ మునిగిన ఉత్తర అట్లాంటిక్ లో ఆదివారం పొగమంచు తుపాను తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కూడా ప్రమాదానికి కారణమని స్పష్టమవుతోంది. ఎందుకంటే టైటాన్ బయల్దేరిన 1.45 గంటలకే సంబంధాలు తెగిపోయాయి. కాగా 2021లో ఓషన్ గేట్ సంస్థ టైటాన్ ద్వారా టైటానిక్ శకలాల సందర్శన టూర్ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు రెండుసార్లు విజయవంతంగా ముగించింది. మూడోసారి మాత్రం పెను ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే అది మరో టైటానిక్ గా మారిపోయినట్లు స్పష్టమవుతోంది. అందు లోని వారి ప్రాణాలు దక్కితే అదే పదివేలు.