జనసముద్రం న్యూస్, జూన్ 17:
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ.. అన్నట్లుగా జరుగుతుంటాయి కొన్ని సంఘటనలు. పాములను ఆడించేవాడు పాముకాటుకే బలైపోయినట్లు కొన్ని ఊహించని సంఘటనలు నిత్యం ఏదో ఒక రూపంలో వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒక న్యాయవాది విషయంలో జరిగింది.
అవును… గుజరాత్ రాష్ట్రంలో ఒక న్యాయవాది ఉన్నారు. ఆయన లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టి సుమారు 15 ఏళ్లు దాటిపోయింది. ఈ క్రమంలోనే ఆయనకు వివాహం అవ్వడం అనంతరం ఒక కుమార్తె జన్మించడం జరిగింది. జీవితం ఇలా నడుస్తున్న దశలో ఆయన జీవితంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఇంతకూ దానికి ముందు ఏమి జరిగిందనే ఇప్పుడు చూద్దాం.
గుజరాత్ లోని ఒక ఫేమస్ లాయర్ వద్దకు ఒక మహిళ వచ్చింది. తన భర్తతో విడాకులు ఇప్పించాలని సదరు లాయర్ ను కోరింది. దీనికి సరే అంటూ ఆమె వద్ద ఫీజు తీసుకున్న ఆ లాయర్.. ఆ కేసును సబ్ మిట్ చేయకుండా.. ఆమెతో పాటు ఆమె భర్తను ఆఫీసుకు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మీరు విడాకులు తీసుకుంటే మీ ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయని మీరు కలిసి ఉంటే ఇద్దరి జీవితాలు బాగుపడుతాయని చెప్పుకొచ్చారు.ఇలా అప్పటినుంచి తన వద్దకు విడాకుల కోసం వచ్చే ప్రతీ జంట దగ్గరా డబ్బులు తీసుకుంటూ అలా నాలుగు రూపాయలు వెనకేసుకుంటూ కేసు వేసి వాదించేపని మానేసి… కౌన్సిలింగులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటివరకూ విడాకులు తీసుకోవాలనుకున్న సుమారు 138 జంటలను ఒక్కటిచేసి “మంచి” లాయర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇదేక్రమంలో.. విడాకులకు వ్యతిరేకంగా గుజరాత్ లో పోరాటం కూడా మొదలుపెట్టారు.
కట్ చేస్తే… ఒక రోజు ఆయనకు కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఏమిటా నోటీసులు అని చూస్తే… తనకు విడాకులు ఇవ్వాలని అతని భార్య నోటీసులు పంపించింది. తనకు తన భర్త నుంచి విడాకులు మాత్రం ఇప్పిస్తే చాలని.. ఆయన నుంచి తాను తన కుమార్తె ఆర్థిక సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కోర్టుకు విన్నవించింది.ఇదే సమయంలో పరిస్థితిని మరింత వివరించిన ఆమె… న్యాయవాద వృత్తిలో ఉన్న ఆయన మాత్రం డబ్బులు సంపాధించకుండా ప్రజాసేవ చేస్తున్నాడని.. ఫలితంగా ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉందని.. దీంతో పాటు తన కూతురు చదువు ఆగిపోయే పరిస్థితి ఎదురైయ్యిందని కోర్టుకు తెలియజేసింది. భరణం కోరినా ఇచ్చే పరిస్థితిలో ఆయన లేరు కాబట్టి.. విడాకులు మాత్రం ఇప్పిస్తే చాలని ఆమె కోర్టుకు తెలిపింది.