రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్ ను సందర్శించాడు. ఎర్ర సముద్రం తీరంలోని రిసార్ట్ లో బస చేశాడు. అనంతరం తన ప్రియురాలితో కలిసి బీచ్ లో సరదాగా ఈత కొడుతున్నాడు. ఇంతలో ఒక టైగర్ షార్క్ ఆ బీచ్ లో కనిపించి.. సముంద్రంలో స్విమ్మింగ్ చేస్తున్న యువకుడిని అమాంతం మింగేసింది. ఈజిప్ట్ లోని హుర్ఘదా బీచ్ రిసార్ట్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఘటన చూసిన కొందరు భయాందోళన చెందారు. అయితే ఆ యువకుడి ప్రియురాలు మాత్రం షార్క్ దాడి నుంచి తప్పించుకుంది. ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. మరోవైపు రష్యా పర్యాటకుడ్ని షార్క్ తినేయడం చూసి అతడి తండ్రితోపాటు బీచ్ లోని ఇతర పర్యాటకులు షాక్ అయ్యారు.
కొందరు భయంతో వణికిపోయారు. రిసార్ట్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఆ యువకుడ్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటన నేపథ్యంలో పర్యాటకులు బీచ్ వద్దకు వెళ్లవద్దని, నీటిలోకి దిగవద్దని హెచ్చరించారు.
కాగా రష్యా యువకుడ్ని తినేసిన టైగర్ షార్క్ ను పట్టుకున్నట్లు ఈజిప్ట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ షార్క్ ను ప్రయోగశాలకు తరలించినట్లు పేర్కొంది. మరోవైపు ఈ సంఘటనపై రష్యా స్పందించింది. రష్యా పర్యాటకులు నీటిలోకి దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిషేధిత బీచ్‌లలో ఈతకు దిగవద్దని సూచించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.