అపాయం పొంచి ఉన్నా.. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు కొన్నిసార్లు. అలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా లేకుంటే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసినప్పుడు విస్మయానికి గురవుతుంటాం. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతంలో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంతకీ అదేమంటే..
ఇప్పుడున్న పరిస్థితుల్లో గీజర్ ను వినియోగించే వారికి కొదవ ఉండదు. గీజర్లకు సంబంధించి మార్కెట్లో బోలెడన్ని ఆప్షన్లు ఉంటాయి. చాలామంది పెద్దగా వాడరు కానీ తక్కువ ఖర్చుతో అయిపోయిందన్న ఉద్దేశంతో గ్యాస్ గీజర్ ను వాడేస్తుంటారు.
ప్రమాదానికి అవకాశం ఉన్నప్పటికి.. తక్కువ ఖర్చు అన్న కారణంగా దీన్ని వినియోగిస్తుంటారు. అలాంటి గ్యాస్ గీజర్ ను వినియోగించిన ఒక యువ జంట ప్రాణాల్ని పోగొట్టుకున్న బ్యాడ్ లక్ ఉదంతం తాజాగా చోటు చేసుకుంది బెంగళూరులోని చిక్కజాల పోలీస్ స్టేషన్ పరిధిలో 30 ఏళ్ల చంద్రశేఖర్.. 22 ఏళ్ల సుధారాణి కలిసి ఉంటారు.
మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఈ యువ జంట లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. వీరిద్దరూ బెంగళూరులోని గోల్ఫ్ హోటల్ లో పని చేస్తుంటారు. శనివారం సాయంత్రం హోటల్ లో తమ పనులు పూర్తి అయిన తర్వాత ఇంటికి చేరుకున్నారు. రాత్రి వేళ గ్యాస్ గీజర్ ఆన్ చేసి.. ఇద్దరు బాత్రూంలో స్నానం చేయటానికి వెళ్లి.. కిటికి తలుపులు మూసేశారు.
అయితే.. స్నానం చేసే సమయంలో గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు లీక్ కావటంతో ఇరువురు స్ప్రహ కోల్పోయారు. కాసేపటికే ప్రాణాలు విడిచారు. అయితే.. వీరిద్దరు ఆదివారం డ్యూటీకి రాకపోవటంతో కొలీగ్స్ వీరిద్దరికి ఫోన్లు చేయటం.. ఎవరు ఫోన్లు లిఫ్టు చేయకపోవటంతో అనుమానించారు.
ఆ వెంటనే.. వారు ఇంటికి చేరుకొని.. తలుపులు కొట్టినా సమాధానం రాలేదు. దీంతో.. తలుపులు బద్ధలు కొట్టి లోపలకు వెళ్లగా.. బాత్రూంలో నిర్జీవంగా పడి ఉన్నారు. వీరి డెడ్ బాడీలను శవపరీక్షకోసం ఆసుపత్రికి తరలించిన. అనంతరం వారి కుటుంబాలకు అప్పజెప్పారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. గ్యాస్ గీజర్ వినియోగించే వారంతా ఇలాంటి ప్రమాదం ఒకటి పొంచి ఉంటుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీకేర్ ఫుల్.