జనసముద్రం న్యూస్, మే 26:
ప్రజా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్న వర్తమానంలోనూ.. రాజుల కాలంలో మాదిరి భారీ భవంతులు.. ఎత్తైన నిర్మాణాలు ఎందుకు? ప్రజల కు అందుబాటులో ఉండేలా సాదాసీదాగా ఎందుకు ఏర్పాటు చేయరు? చూసినంతనే వాటి గంభీరతతో నోట మాట రాకుండా ఉండేలా అధికారక్షేత్రాలు ఎందుకు కనిపిస్తాయి? లాంటి సందేహాలు చాలానే వస్తాయి. కానీ.. అలా చేస్తే తప్పించి గుర్తింపు ఉండదన్నట్లుగా పాలకుల తీరు ఉంటుంది. ప్రజలకు తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేల కు సైతం అందుబాటులోకి రాని ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తారు. అసెంబ్లీ ఎన్నికల కు మరో నాలుగైదు నెలలు మాత్రమే సమయం ఉన్న వేళ.. పని తీరు ఆధారంగా టికెట్లు ఇస్తామే తప్పించి.. సిట్టింగుల కు సీట్లు ఖాయమన్న విషయాన్ని వదిలేయాలని గులాబీ బాస్ కేసీఆర్ స్పష్టంగా చెప్పటం తెలిసిందే.
దీంతో.. అధినేత మనసులో ఏముందన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలంతో ప్రగతిభవన్ కు వస్తున్న ఎమ్మెల్యేలకు షాకింగ్ అనుభవం ఎదురవుతుందని చెబుతున్నారు. తమకున్న ఇబ్బందుల్ని అధినేత కు చెప్పుకోవటంతో పాటు.. తాము ఎంత కష్టపడ్డామన్న విషయాన్ని చెప్పుకోవటానికి వీలుగా ప్రగతిభవన్ కు వస్తున్న ఎమ్మెల్యేలకు అధినేతను కలిసే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారట.
ముందస్తుగా అపాయింట్ మెంట్ తీసుకోకుండా నేరుగా వచ్చేస్తున్న ఎమ్మెల్యేల ను ప్రగతిభవన్ లోపల కు పంపటం లేదన్న అంశం గులాబీ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాము ఎమ్మెల్యేలమన్న విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది లైట్ తీసుకోవటాన్నిఅధికార పార్టీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు అయినప్పటికి పెద్ద సారు అపాయింట్ మెంట్ ఇచ్చారా? ముందస్తుగా తీసుకున్నారా? అన్న ప్రశ్నలు సంధించి.. అన్నింటికి సానుకూలంగా సమాధానం వస్తేనే తప్పించి లోపల కు అనుమతించటం లేదంటున్నారు.గతంలో ఫామ్ హౌస్ లోకి ఎమ్మెల్యేల కు అనుమతి ఉండేది కాదని.. ప్రగతి భవన్ లో పెద్దగా ఆంక్షలు ఉండేవి కాదని.. ఇప్పుడు మాత్రం సీన్ మొత్తం మారిపోయిందంటున్నారు. కొత్త సెక్రటేరియట్ పని చేయటం ప్రారంభమైందో.. అప్పటినుంచి ప్రగతి భవన్ తలుపులు మూసుకుపోయినట్లుగా చెబుతున్నారు. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారికి మాత్రమే అనుమతిస్తున్న వైనంతో గులాబీ ఎమ్మెల్యేలు నోరెళ్లబెడుతున్నారట.
ఓపక్క సిట్టింగులందరికి టికెట్లు ఖాయమని చెబుతూనే మరో వైపు.. అంతర్గత సర్వేలు నిర్వహించటంతో సిట్టింగుల కు తెగ టెన్షన్ గా మారింది. తమ టికెట్ విషయంలో ఏమైనా ఎక్కువతక్కువల విషయాన్ని పెద్ద సారును కలిసిన సందర్భంలో ఆయన నోటి నుంచి వచ్చే హామీకి అనుగుణంగా తమ ప్రయత్నాలు మొదలుపెట్టాలని భావిస్తున్నగులాబీ ఎమ్మెల్యేలకు తాజా పరిణామాలతో ఏం చేయాలో తోచని పరిస్థితులు ఎమ్మెల్యేల కు ఎదురవుతున్నాయి.