జనసముద్రం న్యూస్,తనకల్లు,జనవరి 8,వైభవ్ నరేష్ రిపోర్టర్:
తనకల్లు మండల పరిధిలోని,తనకల్లు గ్రామ పొలం సర్వేనెంబర్ 782-3 వ లెటర్ గల ప్రభుత్వభూమిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ డివిజన్ కార్యదర్శి కదిరప్ప,మండల కార్యదర్శి రెడ్డెప్ప,రైతు సంఘం కార్యదర్శి ఇక్బాల్ మాట్లాడుతూ తనకల్లు,మండ్లిపల్లి, కొక్కంటి క్రాస్ గ్రామాలలో ఇంటి స్థలం లేకుండా బ్రతుకుతున్న నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలను మంజూరు చేయాలని అన్నారు. నిరుపేద, కార్మిక,కర్షక వర్గాలు ఎక్కడైతే కష్టాలలో ఉంటారో వారి సమస్యలను పరిష్కరించే విధంగా సిపిఐ పార్టీ అండగా ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతున్న కనీస సౌకర్యాలలో ఒకటయిన గూడు లేకుండా నిరుపేదలు బాడుగిళ్లలో మగ్గుతూ, కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయన్నారు.అలాంటి నిరుపేదల పక్షాన సిపిఐ పార్టీ నిలబడి వారికి కనీస సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తూ, తనకల్లు గ్రామ పొలం సర్వేనెంబర్ 782 -3 లెటర్ లో గల ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని,ఈ భూ పోరాటం సాగిస్తున్నామని తెలిపారు. పేద, నిరుపేద, కార్మిక, కర్షక తోపుడు బండి వ్యాపారులు,హమాలీలు,బాడుగ ఇళ్లల్లో మగ్గుతున్నటువంటి పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కృతజ్ఞత ఉందో ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు.ఇంటి స్థలం,సొంత ఇల్లు లేకుండా బాడుగా ఇళ్లలో మగ్గుతున్నటువంటి, నిరుపేదలకు తలదాచుకోవడానికి ఇంటి పట్టాను మంజూరు చేసి,వారికి ప్రభుత్వం ఇల్లు నిర్మించిఇవ్వాలనే ఉద్దేశ్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఈ భూ పోరాటానికి శ్రీకారం చుట్టిందన్నారు.అలాగే పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసేంతవరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అలుపెరుగని నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కరీముల్లా, రవీంద్రనాయక్,సీనా, మల్లికార్జున, రామంజులు, శేషప్ప, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.