జనసముద్రం న్యూస్,జనవరి 06:
ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని భావిస్తున్న వైసీపీ.. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజల వద్దకు గడపగడప పేరిట పంపుతూనే.. మరోవైపు వలంటీర్లను కూడా భారీగానే వాడుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వలంటీర్లకు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బృహత్తర బాధ్యతను వైసీపీ అదిష్టానం.. నెత్తికెత్తినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా మంత్రి పినిపే విశ్వరూప్ సంచలన ప్రకటన చేశారు. “ప్రస్తుతం వలంటీర్లు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వారి సేవలను ఎంత పొగిడినా తక్కువే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధుల్లాగా పనిచేస్తున్నారు. అయితే.. వారి సేవలు మరింత పెరగాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిపించేలా వలంటీర్లు పనిచేయాలి. వైనాట్ 175 నినాదాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలి.`అని మంత్రి సూచించారు.అదేసమయంలో వలంటీర్లకు తాయిలం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే.. అది కూడా 175/175 సీట్లుసాధిస్తే.. వలంటీర్ల వేతనాన్ని మూడు రెట్లు పెంచుతామని.. మంత్రి సంచలన ప్రకటన చేశారు. వాస్తవానికి ఇప్పటికే.. ఏ ఎన్నిక జరిగినా వలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారనే వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది ఇక ఇప్పుడు సార్వత్రిక సమరంలోనూ వారిని ప్రధానంగా మార్చే ప్రయత్నం చేయడం గమనార్హం. మరి దీనిపై ప్రతిపక్షాలు ఏమంటాయో చూడాలి.