జనసముద్రం న్యూస్,జనవరి 5:
మనిషి బలహీనతలను ఎరగా వేసి లక్షల రూపాయలు కొల్లగొట్టేందుకు కేటుగాళ్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరి పట్ల అప్రమత్తంగా లేకపోతే మాత్రం డబ్బులతో పాటు మాన.. ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు సైతం అలర్ట్ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ అన్ని మనకే తెలుసనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో కొందరు సైబర్ నేరగాళ్ల చేతిలో ఎరక్కపోయి ఇరుక్కుంటున్నారు.
అన్ వాంటెడ్ లింకులు.. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింకులను అస్సలు ఓపెన్ చేయవద్దని సైబర్ పోలీసులు నెత్తి నోరు మొత్తుకున్నా కొందరు మాత్రం అదే పనిగా మోసపోతున్నారు. అద్భుతమైన ఆఫర్స్.. అందమైన భామలు.. లక్కీ డ్రా పేరిట ఇప్పటికే ఎంతోమంది మోసపోయిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట వెలుగు చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది.తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆన్ లైన్ లో కాల్ గార్ల్ కోసం వెతికి సైబర్ నేరగాళ్ల చేతిలో ఏకంగా 1.97 లక్షలు పొగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వాట్సాప్ గ్రూప్స్.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఏ బీహారో.. యూపీలో జరిగిందంటే ఏమో అనుకోవచ్చు గానీ.. ఇందులో మోసపోయింది మాత్రం మన హైదరాబాద్ వాసే కావడం గమనార్హం.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని చందానగర్లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి నివాసం ఉంటున్నారు. గత డిసెంబర్ నెల చివరి వారంలో ఆన్ లైన్లో కాల్ గర్ల్ కోసం (ఎస్కార్ట్ సర్వీస్) వెతికాడు. ఆ వైబ్ సైట్ లోకి లాగిన్ అయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఒక వాట్సాప్ నెంబర్ దొరికింది. పటేల్ ఛార్మి పేరుతో పరిచయం చేసుకున్న ఆ నెంబర్ నుంచి అతడికి కొందరు అందమైన భామల పిక్స్ వచ్చాయి.
బుకింగ్ కోసం ముందుగా రూ.510 చెల్లించాడు. ఆ తర్వాత ఇతరత్ర ఖర్చుల కింద రూ.5500లు.. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7800 లు చెల్లించారు. ఇలా పలు కారణాలు చెబుతూ అతడి అకౌంట్ నుంచి ఏకంగా 1.97లక్షలను కాజేశారు. చివరికీ అతడు కోరుకున్న కాల్ గర్ల్ రాకపోవడంతో మోసపోయినట్టు ఆ వ్యక్తి గ్రహించాడు.
చివరకు ఈ విషయాన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే ఇలాంటి బాధితుల లిస్ట్ భారీగానే ఉన్నా పరువు పోతుందని కొందరు ఫిర్యాదు చేయడం లేదని తెలుస్తోంది.