జనసముద్రం న్యూస్,జనవరి 4:
కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒమ్రికాన్.. బీఎఫ్ 7 వేరియంట్ సహా మరో రెండు కొత్త వేరియంట్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి తోడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆ దేశంలో జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేశారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి.
చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగా చేయకపోవడం వల్లే ప్రజలు మళ్లీ కోవిడ్ బారిన పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నాటికి చైనాలో సుమారు 10 లక్షల మంది కోవిడ్ తో మృతిచెందే అవకాశం ఉందని ఇటీవల అమెరికా ఒక నివేదికలో ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలు చైనా పట్ల అప్రమత్తం అవుతున్నాయి.
దీనిలో భాగంగానే చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలతో పాటు ఇతర దేశాలన్ని చైనీయులు తమ దేశంలో అడుగు పెట్టాలంటే తప్పనిసరి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని దేశాలు వారిని క్వారంటైన్ చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని చైనా మాత్రం తప్పు పడుతోంది.కొన్ని విదేశీ శక్తులు చైనీయులను కావాలనే బాదానం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఇందులో కుట్ర కోణం ఉందంటూ పరోక్షంగా అమెరికాపై విమర్శలు గుప్పిస్తోంది. రాజకీయాలకు ప్రేరిపితమే తమ దేశంపై కొన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయని మండిపడింది. అంతేకాకుండా తమపై ఆంక్షలు విధించే వారిపై ప్రతీకారం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది.
కాగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన దేశాల్లో ఇండియాతో పాటు అమెరికా.. యూకే దేశాలు ఉన్నాయి. కరోనాను కట్టడి చేసే క్రమంలో ఈ దేశాలు చైనాకు చెందిన విదేశీయులపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెబుతున్నాయి. అయితే చైనా మాత్రం మరొలా ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ దేశాలు చైనా ఆరోపణలపై ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.