
జనసముద్రం న్యూస్,జనవరి 2:
జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి. క్రీడల్లో పోటీకి తగ్గట్లు అప్ డేట్ అవుతూ ఉండాలి.. రాజకీయాల్లో అయితే ఎత్తుగడలు తెలిసి ఉండాలి.. ప్రత్యర్థి కుట్రలను పసిగట్టి ఛేదించగలగాలి.. అన్నిటికి మించి క్యారెక్టర్ బ్యాడ్ కాకుండా చూసుకోవాలి. ఇక ఒక ఆటగాడే రాజకీయాల్లోకి అడుగుపెడితే మరింత పోటీ తత్వంతో స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అందులోనూ జాతీయ జట్టుకు కెప్టెన్ గా చేసినవాడంటే.. మరింత చురుగ్గా ఉండాలి. కానీ ఎక్కడో తప్పటడుగు పడింది. హరియాణ క్రీడల మంత్రి సందీప్ సింగ్ పదవి పోయింది.
క్రీడల నుంచి వచ్చి.. క్రీడాకారిణులపై వేధింపులు?
సందీప్ సింగ్ హాకీ ఆటగాడు. మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓ దశలో భారత్ కు కెప్టెన్ గానూ చేశాడు. అతడి జీవితంపై నాలుగేళ్ల కిందట సూర్మా పేరిట సినిమా కూడా వచ్చింది. ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజే.. సందీప్ పాత్రను పోషించాడు. అలాంటి నేపథ్యం ఉన్న సందీప్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో మంత్రి బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు సందీప్ సింగ్ ప్రకటించాడు. వాస్తవానికి ఓ క్రీడాకారుడు అయినందున.. కింది స్థాయిలో క్రీడాకారిణుల పట్ల వేధింపుల గురించి సందీప్ కు బాగా తెలిసి ఉండాలి. అలాంటి పరిస్థితిని నిర్మూలించాల్సిన బాధ్యత అతడిపైనే ఉంది.కానీ అతడిపైనే లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం గమనార్హం. కాగా సందీప్ సింగ్ కురుక్షేత్రలోని పెహోవా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.జూనియర్ మహిళా కోచ్ ను వేధించినట్లు ఆరోపణలు సందీప్ సింగ్.. తనను వేధించాడంటూ ఓ జూనియర్ మహిళా అథ్లెటిక్ కోచ్ ఇటీవల ఆరోపణలకు దిగారు. ఆ ఆరోపణలను మొదట ఎవరూ పట్టించుకోలేదు.
చివరకు తన తప్పేమీ లేదని సందీప్ నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో రాజీనమా చేయాల్సి వచ్చింది. మహిళా కోచ్ ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది. మంత్రిగా ఉన్న అతడిపై నిజాలేమీ లేకుంటే కేసు పెట్టరు. దీంతో విధిలేని పరిస్థితుల్లో సందీప్ సింగ్ తప్పుకొన్నాడు. తన ఇమేజ్ను చెడగొట్టేందుకే కొందరు చేస్తోన్న ప్రయత్నమన్న ఆయన.. వీటిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నాడు. అందుకే మంత్రిత్వ శాఖ
బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు.
ఇవీ ఆ ఆరోపణలు..తనకు అనుకూలంగా వ్యవహరిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తానంటూ క్రీడల మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేశారని హరియాణాకు చెందిన జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఆరోపణలు చేశారు. తనను సంతోషంగా ఉంచితే కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తానన్నారని.. తాను లొంగకపోవడం వల్ల వేరే చోటుకు బదిలీ చేశారని అన్నారు.
దీనిపై డీజీపీ సీఎం రాష్ట్ర హోంమంత్రి శాఖ కార్యాలయాలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఇటీవల మీడియా ఎదుట మహిళా అథ్లెట్ కోచ్ వాపోయారు.ఇలా మంత్రి సందీప్ సింగ్ చాలా మంది క్రీడాకారిణులను లైంగికంగా వేధించారని..మంత్రికి భయపడి వారెవరూ బయటికి చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే మంత్రి బాధ్యతల నుంచి సందీప్ సింగ్ వైదొలిగిటనట్లు తెలుస్తోంది.





