జనసముద్రం న్యూస్, డిసెంబర్ 24:
బీఎఫ్.7 వేరియంట్ ధాటికి ప్రపంచం వణికిపోతోంది. చైనా చిగురుటాకులా కుప్పకూలుతోంది. నిన్నమొన్నటి వరకు వైరస్ ఉపశమించింది అనుకుంటున్న దేశాలన్నీ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నాయి. కొవిడ్ ను జయించాం అని చెప్పిన దేశాలు మళ్లీ సర్దుకుంటున్నాయి. అసలే శీకాలం కావడంతో అటు అమెరికా బ్రిటన్ నుంచి భారత్ వరకు చాలా దేశాలు తక్షణమే మెరుగైన చర్యలకు ఉపక్రమించాయి. మరోవైపు కొత్త వేరియంట్ ప్రభావం ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అంటూ కథనాలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు ఎందుకైనా మంచిదని మేల్కొంటున్నాయి. చాలాకాలంగా మర్చిపోయిన వ్యాక్సినేషన్ పై మరోసారి సమీక్ష చేపడుతున్నాయి. ఇక భారత్ లో 95 శాతం మందికి రెండు డోసుల టీకా అందడంతో బూస్టర్ డోసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
కొత్త వేరియంట్ కలకలతో చుక్కల మందు టీకాకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి కేంద్రం అన్ని చర్యలు చేపడుతోంది. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదేశాలు అందాయి. భారత్ బయోటెక్ తెచ్చిన ముక్కు టీకా పేరు ‘ఇన్కొవాక్’ శుక్రవారం సాయంత్రం నుంచి కొవిన్ ప్లాట్ఫాంలో అందుబాటులోకి రానుంది.
మన భారత్ బయోటెక్ నుంచే.. కొవాగ్జిన్ కొవిడ్ టీకాను దేశ ప్రజలకు అందించి ప్రాణాలు కాపాడిన భారత్ బయోటెక్ నుంచి ఇప్పుడు బూస్టర్ డోసుగా ముక్కు టీకా రానుంది. ఈ టీకా కు ఆమోదం తెలిపినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంలో శుక్రవారం నుంచే ఈ టీకా అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనే లభ్యం కానుంది. ఏ టీకా పొందినవారైనా.. కొవాగ్జిన్ తో పాటు సీరం సంస్థ అందించిన కొవిషీల్డ్ టీకాను తీసుకున్నవారూ భారత్ బయోటెక్ నాసికా టీకాను పొందవచ్చు. అంటే ఇది ‘హెటిరోలాగస్ బూస్టర్’ అన్నమాట. చుక్కల మందులా ఉంటుంది. దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వేయించుకోవచ్చు. మరోవైపు సీరం సంస్థ తమ టీకానూ వ్యాక్సినేషన్ లో బూస్టర్ గా చేర్చాలని కోరుతోంది.
ప్రపంచ దేశాల్లో కేసులు భారీగా వెలుగుచూస్తుండడంతో క్రిస్మస్ కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ‘మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు. ఈ పండగ సీజన్లో అందరు కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడం ఆవశ్యకం. చైనా కొరియా బ్రెజిల్ నుంచి ప్రారంభమైన కొవిడ్. దక్షిణాసియాకు వ్యాపించింది. 20 నుంచి 35 రోజుల్లో భారత్కు వచ్చింది. తాజా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతోన్న 81.2 శాతం కొత్త కేసులు కేవలం పది దేశాల్లోనే వెలుగుచూస్తున్నాయని ఈ జాబితాలో జపాన్ ముందువరుసలో ఉందని తెలిపింది. ప్రస్తుతం చైనాలో ఆర్ ఫ్యాక్టర్ 16గా ఉందని పేర్కొంది. అలాగే చైనాలో కనిపిస్తోన్న ఉద్ధృతికి గల కారణాలను ప్రస్తావించింది. మెరుగైన సామర్థ్యంలేని టీకాలు తక్కువస్థాయి వ్యాక్సినేషన్ జీరో కొవిడ్ వ్యూహం వల్ల సంబంధిత నిరోధకత లభించకపోవడం ఒక్కసారిగా ఎత్తివేసిన ఆంక్షలు అక్కడి పరిస్థితి కారణమని అధ్యయనాలను ఉటంకించింది.