జనసముద్రం న్యూస్,డిసెంబర్ 19 :
ప్రస్తుత రోజుల్లో మానవ సంబంధాలన్నీ కూడా రోజురోజుకు దిగజారిపోతున్నాయి. బంధాలు.. బంధుత్వాలకు ఏమాత్రం విలువలు లేకుండా పోతున్నాయి. కళ్ళ ముందే హత్యలు.. అత్యాచారాలు జరుగుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుండటంతో యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి.
కన్నతల్లి ప్రేమకు.. సవితి తల్లి ప్రేమకు మధ్య ఎంతో తేడా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అలాగే కన్నతండ్రికి.. సవితి తండ్రి మధ్య తేడా ఏంటో హైదరాబాద్లో తాజాగా వెలుగు చూసిన ఘటన కళ్ళకు కట్టినట్లు చూపింది. సవితి కూతురు తరుచూ ఫోన్లో మాట్లాడుతూనే సాకుతో ఆమె గొంతు నిలిపి పినతండ్రి హత్య చేసిన ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారంలో యాస్మిన్ ఉన్నిసా(17) తన కుటుంబంతో కలిసి జీవిస్తోంది. యాస్మిన్ తల్లిని సాధిక్ అనే వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే యాస్మిన్ అర్ధరాత్రి వేళ తరుచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండటాన్ని సాధిక్ గమనించాడు.
ఈమేరకు ఉన్నిసాను ఫోన్లో ఎక్కువగా మాట్లాడొద్దని పలుమార్లు హెచ్చరించాడు. అతడిని మాటలను ఉన్నిసా పట్టించుకునేది కాదు. ఆదివారం కూడా సవితి కూతురు ఫోన్లో మాట్లాడటాన్ని గమనించి సాధిక్ ఆమెపై కోపం ఊగిపోయాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎదురించి మాట్లాడటంతో సాధిక్ రెచ్చిపోయి ఆమె గొంతు నులిమి వేశాడు.
ఈ సంఘటనలో ఉన్నిసా ప్రాణాలను కోల్పోయింది. దీంతో భయాందోళనకు గురైన సాధిక్ ఆ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు నివేదిక వచ్చాక అసలు విషయం బయటకు వచ్చే అవకాశముంది.