రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సెగ బాగానే ఉంది. అధికార పార్టీలు మళ్లీ తమ పంతం నెగ్గించుకు నేందుకు అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల ఉనికి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుండడం గమనార్హం. దీంతో అధికార పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది? ఎవరికెవరు తోడు..? ఎవరికెవరు నీడ? అనే చర్చ సాగుతోంది.
తెలంగాణ పరిస్థితిని తీసుకుంటే.. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు రెండూ కూడా దూకుడుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ జోరు కనిపిస్తోంది. పైగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ప్రతిష్టాత్మకంగా కూడా భావిస్తున్నా రు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారం లోకి రావాలని కంకణం కట్టుకున్నట్టుగా వారి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ కూడా సంస్థాగతంగా లెక్కు మిక్కిలి ఇంచార్జులను నియమించి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఏపీ పరిస్థితిని గమనిస్తే.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో జోరు కూడా పెంచింది. అయితే వైసీపీకి దీటుగా టీడీపీ కూడా ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకుంది.వచ్చే జనవరినుంచి లోకేష్ పాదయాత్ర కూడా ప్రారంభిస్తున్నారు. ఇక మరోపార్టీ జనసేన కూడా దూకుడు పెంచింది. నాయకులు కార్యకర్తలతో సంబంధం లేకుండా.. పార్టీ అధినేత పవన్ ప్రచారానికి దిగుతున్నారు.
అంటే.. మొత్తంగా 2023లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు మరింత సలసల కాగనున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాల్లోని అధికారపార్టీలకు మధ్య అవగాహన కుదురుతుందా? అనేది చర్చ. గత 2019 ఎన్నికల్లో కేసీఆర్.. జగన్కు సాయం చేశారనే వాదన ఉంది.
ఇక ఇప్పుడు జగన్ కూడా కేసీఆర్కు సాయం చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ సారి.. బీఆర్ ఎస్ పార్టీ పెట్టిన కేసీఆర్ తద్వారా.. జగన్కు కూడా వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చేలా రాజకీయ వ్యూహాలకు సిద్ధమవుతారనే చర్చసాగుతోంది. దీంతో ఎవరికెవరు తోడు-నీడ?! అనే చర్చ హాట్గా మారింది.