కరోనాకు ముందు నాటికి తర్వాతి నాటికి తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కరోనాకు ముందు ఎప్పుడూ వినని.. చూడని ఎన్నో ఉదంతాలు కరోనా తర్వాత చూస్తున్న పరిస్థితి. అప్పటివరకు బాగానే ఉండి.. హుషారుగా నలుగురి మధ్యలో ఉండి కేరింతలు కొట్టే వారు హటాత్తుగా కుప్పకూలిపోవటం.. ఆ వెంటనే ప్రాణాలు విడుస్తున్న విచిత్రమైన ఉదంతాలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. అయితే.. ఇలాంటి ఉదంతాలు మధ్య వయస్కులే ఎక్కువగా విన్నాం. చూశాం. అందులో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలానే బాధితులు ఉన్నారు.
ఇందుకు భిన్నంగా మధ్య ప్రదేశ్ లో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించి వింటే భయంతో వణికిపోతాం. ఎందుకిలా? జరిగి ఉంటుందన్న షాక్ నుంచి ఒక పట్టాన బయటకు రాలేని పరిస్థితి. అంతటి షాకింగ్ ఉదంతంగా దీన్ని చెప్పాలి. మధ్యప్రదేశ్ కు చెందిన పన్నెండేళ్ల పిల్లాడు స్కూల్ బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవటం.. ఆ వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళితే.. కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారన్న విషయం గురించి తెలిసిన వారు నోటి వెంట మాట రాలేని రీతిలో ఉండిపోతున్నారు.
మధ్యప్రదేశ్ లోని బింద్ జిల్లాలోని ఒక స్కూల్లో మనీశ్ జాటవ్ అనే పన్నెండేళ్ల పిల్లాడు నాలుగో తరగతి చదువుతన్నారు. గురువారం తన సోదరుడితో కలిసి లంచ్ అవర్ లో భోజనం చేవాడు. ఆ తర్వాత 2 గంటలకు స్కూల్ పూర్తి అయ్యాక.. ఇంటికి వెళ్లేందుకు స్కూల్ బస్సు ఎక్కాడు. తన తోటి మిత్రులతో సరదాగా ఉంటూ కేరింతలు కొట్టాడు. కాసేపటికే ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో పిల్లాడి గురించి స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చిన బస్సు డ్రైవర్.. వెంటనే అక్కడికి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆ విద్యార్థి ప్రాణాలతో లేడన్న షాకింగ్ నిజాన్ని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చేసరికే ప్రాణాలతో లేడని.. సీపీఆర్ చేసినా కూడా కాపాడలేకపోయినట్లుగా పేర్కొన్నారు. పిల్లాడి మరణానికి కారణం ఏమై ఉంటుందన్న విషయానికి వస్తే.. తాము చూస్తున్న ప్రాథమిక లక్షణాల్ని చూస్తే.. సదరు పిల్లాడు కార్డియాక్ అరెస్ట్ కు గురైనట్లుగా భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
అయితే.. ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రం మొత్తంలో ఇదే మొదటిది అవుతుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. తమ కొడుక్కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మనీశ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ విలపిస్తున్నారు. మారిన కాలానికి తగ్గట్లు.. మరణాల్ని అంచనా వేయటం చాలా కష్టంగా మారిందన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతం ఉందని చెప్పక తప్పదు.