జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16:
రాజశ్యామల అమ్మ వారి మరో అవతారం. అమ్మ వారికి ఉన్న అనేక రూపాలలో ఇది ఒకటి. రాజ్యాన్ని కాంక్షించే వారు విజయాలను కోరుకునే వారు రాజశ్యామల యాగం చేస్తే సర్వం సిద్ధిస్తుంది అని ఆస్థిక జనులు ఆధ్యాత్మిక పరులు బలంగా నమ్ముతారు. వర్తమానంలో కేసీయార్ జగన్ రాజ్యశ్యామల యాగం చేసి అధికారాలు అందుకున్నారని అంటారు. తాజాగా చూస్తే ఢిల్లీలో కేసీయార్ బీయారెస్ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా అక్కడ రాజశ్యామల యాగాన్ని చేయించారు.
విశాఖలోని శారదాపీఠంలో ఏటా వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ వార్షికోత్సవాల చివరి రోజుల రాజశ్యామల యాగం చేస్తారు. జగన్ సీఎం అయ్యాక ప్రతీసారి రాజశ్యామల యాగంలో పాల్గొంటూనే ఉన్నారు. ఇక 2023లో కూడా పీఠం వార్షికోత్సవాలు ఉన్నాయి. జనవరి 27 నుంచి 31 వరకూ అయిదు రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలలో రాజశ్యామల యాగం నిర్వహిస్తారు.
గత ఏడాది జగన్ అమ్మ వారి యాగంలో పాల్గొన్నారు. ఈసారి కూడా ఆయన తప్పకుండా హాజరవుతారు అని అంటున్నారు. శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ ఆఫీసులో కలిసారు. ఆహ్వాన పత్రం అందచేశారు. జగన్ కి ఆశీస్సులు అందచేశారు. మొదటి నుంచి శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామీజీ అంటే జగన్ కి గురి.
ఇపుడు ఆయన విశాఖ రాజధాని కావాలనుకుంటున్నారు. దానికి ముహూర్తం కూడా పెట్టాలని స్వామీజీని కోరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. విశాఖకు రాజధాని షిఫ్ట్ అయితే అంతా బాగా జరుగుతుందని జగన్ ఆలోచిస్తున్నారు. అయితే రాజధానికి మాత్రం అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఈ నేపధ్యంలో కొత్త ఏడాది వస్తూనే శారదాపీఠం వెళ్ళి స్వామీజీ ఆశీస్సులు జగన్ అందుకుంటారని రాజశ్యామల అమ్మవారి యాగంలో మరోమారు పాలుపంచుకోవడం ద్వారా తన విశాఖ రాజధాని కోరిక ఈడేరాలని ప్రార్ధిస్తారు అని అంటున్నారు. గత ఏడాది కూడా వార్షికోత్సవాలకు జగన్ విచ్చేసినపుడు విశాఖ రాజధాని గురించే ప్రచారం జరిగింది. స్వామీజీ ముహూర్తం పెట్టేశారు అని అంతా అనుకున్నారు.
కానీ గుర్రిన ఏడాది తిరిగింది కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉంది. దాంతో ఈసారి ఆటంకాలు ఏవీ లేని ముహూర్తాన్ని చూడమని జగన్ స్వామీజీని కోరుతారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే విశాఖకు పార్టీ ఆఫీసుని ముందు తరలించి ఆనక సీఎం ఆఫీసుని కూడా షిఫ్ట్ చేయాలని వైసీపీ పెద్ద ప్లాన్ లో ఉంది. ఇదంతా 2023లో జరగాలి. తొలి ఆరు మాసాల్లోనే జరగాలి. మరి అది కుదరకపోతే ఇక విశాఖ రాజధాని కలను మరచిపోవచ్చు. ఎందుకంతే 2024లోనే ఎన్నికలు కాబట్టి. సో జగన్ని రాజశ్యామల అమ్మ వారు కరుణిస్తే విశాఖే రాజధాని అంటున్నారు.