జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 :
జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్ధార్ పటేల్ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
అంతకుముందు అక్కడ రాజశ్యామల నవచండీయాగాలు నిర్వహించారు. ఈ యాగాల్లో కేసీఆర్ ఆయన సతీమణి శోభ ఎమ్మెల్సీ కవితతోపాటు ఆ పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇక ఈ బీఆర్ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ జేడీఎస్ నేత కుమారస్వామి హాజరయ్యారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు.టీఆర్ఎస్ నుంచి ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత పార్టీ మంత్రులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు కీలక సమావేశాల కారణంగా మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నట్టు తెలిపారు. పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.ఇవాళ పార్టీ నేతలతో కలిసి ఆఫీస్ లోని ప్రధాన గదిలో దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఈనెల 17 వరకూ ఢిల్లీలో ఉండనున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు.