జనసముద్రం న్యూస్,డిసెంబర్ 13:
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి అంతరిక్ష యాత్రలు చేసే స్థాయికి మహిళలు ఎదిగిపోయారు. అయితే పోలీస్.. రక్షణ విభాగాల్లో మాత్రం మహిళలకు ఆశించినంత అవకాశాలు లభించడం లేదు. అయితే కొన్ని చోట్ల మాత్రం వీరికి అనుకూల పరిస్థితులు ఉండటంతో భద్రతా విభాగంలోనూ తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు.
ఐఏఎస్ వంటి జాబ్స్ ను కాకుండా ఛాలెంజ్ తో కూడిన ఐపీఎస్ వంటి పోస్టుల్లోనూ రాణిస్తున్నారు. న్యాయస్థానాలు మహిళలకు సైతం ఆర్మీలో అవకాశాలు కల్పించాలని ఇటీవల తీర్పును ఇవ్వడంతో త్రివిధ దళాల్లోనూ తమ సత్తా ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సీఎం వంటి హోదా కలిగిన నేతలకు సైతం భద్రత అందించే విభాగాల్లో మహిళలు పోటీ పడుతుండటం విశేషం.
తమిళనాడు సీఎంగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టినప్పటికీ నుంచి ఆ రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. అలాగే తన సెక్యూరిటీ కోర్ విభాగంలో తొమ్మిది మంది అమ్మాయిలకు అవకాశం ఇచ్చారు. దీంతో ఆ యువతులంతా మెరికల్లా కదులుతూ సీఎంకు రక్షణగా ముందు నిలుస్తున్నారు.
సఫారీ సూట్లు ధరించి తమ ఎక్స్ 95 సబ్ మిషన్ గన్స్.. ఎకే 47.. 9 ఎంఎం పిస్టల్స్ ధరించిన తొమ్మిది అమ్మాయిలు సీఎం కాన్వాయ్ వెంట ప్రయాణిస్తున్నారు. సీఎం కంటే ముందుగా కాన్వాయ్ దిగి ప్రతీ అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే సీఎం బయటికి వచ్చి తన పనుల్లో నిమగ్నం అవుతారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాన భద్రతా బృందంలో సబ్-ఇన్స్పెక్టర్ ఎం థనుష్ కన్నకి.. హెడ్ కానిస్టేబుల్ ఎం ధిల్షాత్ బేగం.. కానిస్టేబుల్స్ ఆర్ విద్య.. జె సుమతి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వీరితోపాటు ఎం కాళీశ్వరి.. కె పవిత్ర.. జి రామి.. వి మోనిషా.. కె కౌసల్యలు ఈ బృదంలో సభ్యులుగా ఉన్నారు.
వీరంతా కూడా ఈ ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కోర్ సెక్యూరిటీ డిటెయిల్లో చేరారు. వీరి ప్రధాన డ్యూటీ అన్నా అరివాలయం (డీఎండీకే ప్రధాన కార్యాలయం) వద్ద సెక్యూరిటీ నిర్వర్తించారు. ఈ పోస్టులకు సుమారు 80 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే శారీరక.. మానసిక ప్రతిభ కలిగిన వారిని షార్ట్ లిస్ట్ చేసి ఈ తొమ్మిది మంది అమ్మాయిలు ఎంపిక చేశారు.