జనసముద్రం న్యూస్, బొమ్మనహాల్, డిసెంబర్ 12:
అకాల వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
మిర్చి పంట నష్టపరిహారం కోసం అధికార్ల చుట్టూ తిరిగినా రైతు రేవన్నకు దక్కని సాయం
సాంకేతిక కారణాలతో అన్నదాతలకు తప్పని తిప్పలు
తక్షణమే ప్రత్యేక బృందాలను పంపి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి
కచ్చితంగా జగన్ రెడ్డి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి రైతులకు సంపూర్ణ న్యాయం జరిగేవరకు టీడీపీ అలుపెరుగనిపోరాటం చేస్తుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు రైతులకు అభయమిచ్చారు. మాండూస్ అకాల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను సోమవారం అయన దేవగిరి క్రాస్ వద్ద పరిశీలించారు. రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ…అకాల వర్షాలు, అధిక వర్షాలు, ఏదో ఒక కారణంతో పంటలు దెబ్బతినటం, ప్రభుత్వంపై ఆశలు పెట్టుకోవటం, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడటం, నిరాశ చెందటం షరా మామూలుగా మారిందన్నారు. రైతు రేవన్న వరుసగా రెండవసారి పంటను నష్టపోయాడన్నారు. గత సంవత్సరం ఇదే భూమిలో మిర్చి పండించి భారీగా నష్టపోయాడన్నారు. ఈ సంవత్సరం చెరకు పండిస్తూ 7 నెలలుగా కాపాడుకుంటూ వచ్చినా, ఈ అకాల వర్షాలకు చెరకు పంట తీవ్రంగా దెబ్బ తినిందన్నారు. ఇతర పంటలకంటే మిర్చి, చెరకు పంటలకు అధిక పెట్టుబడి పెట్టాలన్నారు. సగటు రైతు వరుసగా రెండుసార్లు నష్టపోతే అతని ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుందన్నారు. మిర్చి పంట నష్టపరిహారం కోసం అనేకసార్లు అధికార్ల చుట్టూ తిరిగినా ఎటువంటి ప్రయోజనం ఈ రైతుకు దక్కలేదన్నారు. అకాల వర్షాలతో రైతులకు ఇంత నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వ అధికారులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు పంటలను పరిశీలించే ఓపిక, తీరిక లేవని విమర్శలు గుప్పించారు.
జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసి నిలువునా మోసం చేస్తున్నదని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయే రైతులను వెంటనే ఆదుకుంటానని వాగ్దానం చేసిన జగన్ రెడ్డి ఈ రైతుకు ఏమి సమాధానమిస్తాడని రైతు నష్టపోయిన వ్యవసాయ క్షేత్రం నుంచి ఘాటుగా ప్రశ్నించారు. మిర్చి, పత్తి, అన్నిరకాల పంటలు దెబ్బతింటుంటే ఎవరు మాట్లాడరు, వచ్చి చూడరు, రైతుల బాధ తెలుసుకోరు, నష్ట పరిహారం ఇవ్వరు. కచ్చితంగా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమా కాదా అని ప్రశ్నించారు. ఏవో సాంకేతిక కారణాలు చెప్పి నష్టపరిహారాన్ని చెల్లించకుండ ప్రభుత్వం సాకులు చెబుతుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే తప్ప రైతుకు న్యాయం జరుగదన్నారు. రైతులకు జరిగిన పంట నష్టాన్ని ప్రత్యక్షంగా చూసి వారిని ఆదుకోవాలని కోరారు. తుంగభద్ర ఎగువ కాలువ పరిధిలో పండించిన పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ధాన్యం కూడా తడిచిపోయి దెబ్బతినిందన్నారు. కోత ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రవాణా కూడా కూడా కష్టంగా మారిందన్నారు.
కచ్చితంగా ఈ ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి రైతుకు న్యాయం జరిగేంతవరకు టీడీపీ పోరాడుతుందని మాజీ మంత్రి చెప్పారు. కనీసం మీరైనా పట్టించుకొని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తక్షణమే ప్రత్యేక బృందాలను పంపి రైతులకు జరిగిన నష్టాన్ని సక్రమంగా అంచనా వేసి నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కు కాలవ విజ్ఞప్తి చేశారు.
ఆయనతో పాటు రాష్ట్ర తెలుగురైతు విభాగం ఉపాధ్యక్షులు కొండాపురం కేశవరెడ్డి, మండల కన్వీనర్ బలరాం రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గ తెలుగు రైతు విభాగం అధ్యక్షులు వెంకటేశులు, కొత్తపల్లి మల్లికార్జున, ధనుంజయ మోహన్, గోవిందరాజులు, నవీన్, మళ్ళిడు శ్రీనివాసులు, సంగప్ప, హనుమంతు, టీడీపీ సోషల్ మీడియా నాగరాజు, నియోజకవర్గం ఉపాధ్యక్షులు వెంకట కృష్ణ, వేపమాను ప్రేమ్ కుమార్, లేపాక్షి, నర్సరీ శ్రీనివాసులు, లక్ష్మినారాయణ, నాగరాజు, గ్యాస్ గోవింద, కేశవ రెడ్డి, రైతులు తదితరులున్నారు.