జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 :
నేడు ప్రపంచ మానవాళి హ్యూమన్ రైట్స్ డే ను జరుపుకుంటోంది. మానవ హక్కుల పరిరక్షణ.. హక్కుల అణచివేత లేని సమాజం నిర్మించేందుకు నిరంతరం సాగించాల్సిన కృషిని గుర్తుగా డిసెంబర్ 10 తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా మనమంతా జరుపుకుంటున్నాం.ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల డిక్లరేషన్ చేసింది. నాటి నుంచి డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా అన్ని దేశాలు జరుపుకుంటున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్లను సమాంతరంగా ఏర్పాటు చేశారు.
2022 సంవత్సరం మానవ హక్కుల దినోత్సవం థీమ్ ”గౌరవం (డిగ్నిటీ).. స్వేచ్ఛ (ఫ్రీడమ్).. అందరికీ న్యాయం (జస్టిస్ ఫర్ ఆల్)”. ఈ ఏడాది అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన ఆమోదించిన (యూడిహెచ్ఆర్) 74వ వార్షికోత్సవంగా.. 72వ మానవ హక్కుల దినోత్సవంగా అన్ని దేశాలు జరుపుకుంటున్నాయి.
మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ హక్కుల్లో ప్రధానంగా ఆరోగ్యపరమైన.. ఆర్థిక.. సామాజిక పరమైన.. విద్య తదితర హక్కులు ఉన్నాయి. మానవ ప్రకృతి సిద్ధమైన హక్కులను ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నారు.
వీటిని తెగ.. కులం.. జాతీయత.. మతం.. లింగం తదితరాల ఆధారంగా అణచి వేయడం మరియు వంచించడం లాంటివి జరగకూడదు. ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 423(వి) తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత మానవ హక్కుల దినోత్సవాన్ని లాంఛనంగా 1950వ సంవత్సరం నుంచి ప్రారంభించారు.
అదే విధంగా కొన్ని దశాబ్దాలుగా మానవ హక్కుల దినోత్సవం పరిధిలోకి వివక్ష (డిస్క్రిమినేషన్).. వైవిధ్యం (డైవర్సిటీ).. విద్య.. స్వేచ్ఛ.. పేదరికం.. చిత్రవధ(టార్చర్).. సమానత్వం వంటి వాటికి చోటు కల్పించారు. దీంతో మానవ హక్కుల జాబితా రోజురోజుకు పెరుగుతూ పోతుంది. తద్వారా మానవుడు అన్ని రంగాల్లో హింస గురికాకుండా హక్కులు పొందే అవకాశం లభిస్తుంది.
ఇక భారత్లో మానవ హక్కుల చట్టం 28 సెప్టెంబర్ 1993 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు నాటి ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని 12 అక్టోబర్ 1993లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఈ సంఘం రాజకీయం.. ఆర్థిక.. సామాజిక.. సాంస్కృతిక రంగాల్లో పని చేస్తుంది.మానవ హక్కుల సంఘం కృషి ఫలితంగా ప్రతి ఒక్కరు తమ హక్కులను తెలుసుకుంటున్నారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 30 ఉన్న సెక్షన్లు మానవ హక్కులను తెలియజేస్తుంది. ఎవరైనా మన హక్కులకు భంగం కలిగించినట్లయితే భావిస్తే కోర్టును లేదా మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించి ఈ ఆర్టికల్స్ ద్వారా తమ హక్కులు సాధించుకోవచ్చు.