జనసముద్రం న్యూస్,డిసెంబర్ 9:
మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య తలెత్తిన ఉద్రిక్తలతో హైఅలర్ట్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రకు చెందిన వాహనాలపై కర్ణాటకలో దాడులు జరుగుతున్నాయి. అలాగే కర్ణాటకకు చెందిన వాహనాలపై మహారాష్ట్రలో దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బసవరాజ బొమ్మై ఏకనాథ్ షిండేలు చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు.
మరోవైపు రెండు రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెళగావి ప్రాంతం తమదేనని ఎప్పటి నుంచో మహారాష్ట్ర వాదిస్తోంది. ఆ ప్రాంతంలో మరాఠీ మాట్లాడే ప్రజలు అత్యధికంగా ఉన్నారని.. వారందరినీ 1956లో రాష్ట్రాల పునర్విభజన సమయంలో కర్ణాటకలో కలిపారనేది మహారాష్ట్ర వాదన. 1956 నుంచి ఈ గొడవ సాగుతూనే వస్తోంది.రెండు రాష్ట్రాల సరిహద్దులకు ఆనుకుని ఉండే బెళగావి కోసం కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు తగదా పడుతున్నాయి. ఆ భూభాగం తమదంటే తమదని కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. కర్ణాటకలో ఉన్న బెళగావి నిప్పాణి కార్వార వంటి ప్రాంతాలతో పాటు 814 గ్రామాలు తమకు చెందుతాయని మహారాష్ట్ర వాదిస్తోంది.
కాగా దీనిపై రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. అయితే ఇంతలో కర్ణాటకలో ఉన్న బెళగావి జిల్లాలో మహారాష్ట్ర మంత్రి ఒకరు పర్యటించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఆయన తమ ప్రాంతంలో పర్యటించకూడదంటూ స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హెచ్చరించడం గమనార్హం.మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద ప్రాంతంలో పర్యటించడంతో కన్నడిగులు రెచ్చిపోయారు. తమ రాష్ట్రంలో తిరుగుతున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనాలపై దాడులకు దిగారు. దీంతో రెండు రాష్ట్రాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి.
వాస్తవానికి అటు కర్ణాటకలో ఇటు మహారాష్ట్రలో రెండు చోట్ల బీజేపీ దాని మిత్రపక్ష ప్రభుత్వాలే ఉన్నాయి. అయినా సమస్య కొలిక్కి రావడం లేదు. వివిధ పార్టీల నేతలు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలతో వివాదం ముదురుతోంది.మహారాష్ట్రతో సరిహద్దు వివాదం నేపథ్యంలో తమ రాష్ట్రంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని ఇప్పటికే డీజీపీకి సంబంధిత పోలీసు అధికారులకు హోమ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ కు చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్య తదితర నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు.ప్రజలు శాంతియుతంగా ఉండాలని మేము పదేపదే మనవి చేస్తున్నామని.. కానీ ప్రతిపక్ష నేతల రెచ్చగొట్టే ప్రకటనలతో పరిస్థితి అదుపు తప్పుతోందని తెలిపారు. మహారాష్ట్ర పంచాయితీ విషయంలో ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించానని కర్ణాటక సీఎం బొమ్మై తెలిపారు. మహారాష్ట్రలోనూ బీజేపీ అధికారంలో ఉందని.. కాబట్టి సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్టు వివరించారు.
ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో మాట్లాడి రెండు రాష్ట్రల ప్రజలు శాంతియుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. సరిహద్దు వివాదంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నిలిచిపోయాయని.. చర్చల ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.