జనసముద్రం న్యూస్,డిసెంబర్ 4
ఏపీలో సలహాదారుల జాబితా అంతకంతకు పెరిగిపోతోంది. వారు ఏమి చేస్తారో ఏమి చేయాలని ప్రభుత్వం వారిని నియమించుకుందో జన సామాన్యానికి తెలియదు. అయితే గతంలో అప్పటి ప్రభుత్వాలలో సలహాదారులు ఉన్నా ఇంత ఎక్కువ సంఖ్యలో మాత్రం లేరు. కానీ ఇపుడు చూస్తూండగానే అర్ధ సెంచరీ దాటిపోయింది నంబర్. ఇది మరింతగా పెరుగుతోంది కూడా.
లేటెస్ట్ గా మరో ఇద్దరు సలహాదారులను ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ శాఖకు తిరుపాల్ రెడ్డి ఉద్యాన శాఖకు శివప్రసాద్ రెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవులలో వీరు రెండేళ్ల పాటు కొనసాగుతారు అని పేర్కొంది.దీనికి ముందు కొద్ది రోజుల క్రితం పంచాయతీ రాజ్ శాఖకు కూడా కొత్త సలహాదారునిగా పోతినేని నాగార్జున రెడ్డిని నియమించారు. ఇలా చూస్తూ పోతే ఈ సంఖ్య అర్ధ సెంచరీ దాటేసి సెంచరీకు చేరుకుంటుందా అన్న డౌట్ వస్తోందిట. ఇక చూస్తే ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించవద్దని హై కోర్టు పేర్కొంది. ఆ నియామకాలను వ్యతిరేకించింది.
గతంలో దేవాదాయ శాఖకు సలహాదారునిగా జ్వాలాపురం శ్రీకాంత్ ని నియమించగా హై కోర్టు ఆ నియామకం మీద స్టే ఇచ్చింది. అయినా సరే ఇపుడు వరసబెట్టి కీలకమైన ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమిస్తున్నారు. మరి ఈ నియామకాలు ఎంతవరకూ చెల్లుతాయో ఏమో తెలియదు అంటున్నారు. అదే సమయంలో ఈ పదవులు తీసుకున్న వారు ఒకవేళ చేయాలంటే ఏ పని ఉంది అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.అనేక ప్రాధాన్యత కలిగిన శాఖలకు మంత్రులు ఉంటారు. అధికారులు ఉంటారు. ఎంతో పెద్ద వ్యవస్థ ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా సలహాదారులను వాటిని నియమించి వారి నుంచి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్న చర్చ వస్తోంది. అదే టైంలో సలహాదారులకు వేతనాలు ఖర్చు వారి మీద ప్రభుత్వం పెట్టే వ్యయం అన్నీ కూడా ఇపుడున్న పరిస్థితులలో అవసరమా అన్న పాయింట్ ని కూడా కొంతమంది లేవనెత్తుతున్నారు.
అయితే చాలా మంది వైసీపీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు పదవులు ఇవ్వలేకపోతున్నారు. వారిలో అసంతృప్తి పేరుకుపోతోంది. దాంతో వారి కోసం రాజకీయ పునరావాసంగా ఈ నియామకాలు చేపడుతున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీని మీద విపక్షాలు కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నాయి. ఎందుకు ఇంతమంది సలహాదారులు వారు చేసే పనులు ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నాయి.
అయినా సరే వైసీపీ వీరిని వరసబెట్టి నియమిస్తోంది అంటే రాజకీయ ప్రయోజనాలు ఎన్నికల అవసరాలు దృష్టిలో ఉంచుకునే ఈ నియామకాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా సలహాలు ఇచ్చేవారు ఉండాలి కానీ వారే ఎక్కువ అయిపోతే అయోమయం గందరగోళం ఏర్పడుతుంది అన్న వారూ ఉన్నారు.