జనసముద్రం న్యూస్,నందిగామ,డిసెంబర్ 2 :
గత కొన్ని నెలలుగా అడ్డు అదుపు లేని తతంగం
చేగూరు శివార్లలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
గతంలో బండోని గూడ, చౌలపల్లి తదితర ప్రాంతాల్లో కూడా ఇదే తతంగం
అమాత్యుల 100 ఎకరాల ఫామ్ హౌస్ కోసం జరుగుతున్న ఈ తతంగం
నందిగామ మండల పరిధిలోని చేకూరి శివారు
ఆయన ఓ అమాత్యులు.. ఆయన ఆర్డర్ పాస్ చేస్తే ఇక అంతే సంగతులు.. తన సొంత ఫామ్ హౌస్ నిర్మాణం కోసం గత కొన్ని నెలలుగా మట్టిని అక్రమంగా తవ్వి తన మంది మార్బలంతో వాహనాల్లో తీసుకెళుతున్నారు. దీనికోసం సరిహద్దులను దాటేశారు. అమాత్యలవారు ఆర్డర్ చేస్తే బార్డర్ దాటాల్సిందే మరి..! ఎక్కడో మద్దూరు వద్ద ఆయనకు సంబంధించిన 100 ఎకరాలకు పైగా నిర్మిస్తున్న ఫామ్ హౌస్ నిర్మాణం కోసం ఏకంగా ఊళ్ళకు ఊళ్లే మట్టిని తవ్విస్తున్నారు. దర్జాగా గ్రామాల్లో మట్టిని తీసుకెళ్తూ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ఈ అమాత్యుల వారు రంగారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినవారు కాదు. ఎక్కడి జిల్లా వారో ఇక్కడికి వచ్చి మరి దర్జాగా డాబుసరిగా తన ఫామ్ హౌస్ నిర్మాణానికి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు మిన్నంటాయి. ఇదేమని ప్రశ్నించిన కొన్ని గ్రామాల నాయకులను ఇప్పటికే ఆయన భయభ్రాంతులకు గురిచేసిన ఆరోపణలు కూడా లేకపోలేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగుర్ శివార్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామస్తులు, నాయకులు కొందరు మీడియా కార్యాలయాలకు ఫోన్లు చేసి మరి తమ గొడు వెల్లబుచుతున్నారు. సర్వే నెంబర్ 218/23లలో మట్టిని రాత్రింబవళ్లు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిప్పర్ల ద్వారా జెసిబి యంత్రాల సహాయంతో అనునిత్యం ఉదయం సాయంత్రం మట్టిని యదేచ్ఛగా తరలించకపోతున్నట్లు స్పష్టం అవుతుంది. అమాత్యుల 100 ఎకరాల ఫామ్ హౌస్ కోసం జరుగుతున్న ఈ తతంగంలో ప్రకృతి సంపద తరలిపోతుంది. అధికారులు చూసి చూడనట్టు పట్టినట్లు నాజూకుగా వ్యవహరిస్తున్నారు. కళ్ళముందు ఈ రాద్ధాంతం జరుగుతుంటే తమకు తెలియనట్టు నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆ మధ్య ఫామ్ హౌజ్ కోసం బుగ్గోని గూడ, చౌలపల్లి తదితర ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తరలించిన సంఘటనలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో అమాత్యుల కోతిమూక పలాయనం చిత్తగించింది. తాజాగా ఇప్పుడు చేగురు శివారుపైన వీరి దృష్టి పడింది. ఇదేం చోద్యం అంటూ నాయకులు గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. ఆయన గారి ఫామ్ హౌజ్ కోసం ఈ తతంగం అవసరమా? అంటూ నిలదీస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు..? అసలు మట్టి అనుమతులు ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు?.. ఆయా గ్రామాల పర్యావరణం వారికి పట్టదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందిగామ మండలంలో మట్టి తవ్వకాలు యధేచ్చగా సాగుతున్నాయి. ఎర్రమట్టి, గ్రావెల్ మట్టి ఏదైనా చిటికెలో ఎన్ని టిప్పర్ల లోడు కావాలన్నా ఇస్తారు. రాత్రి, పగలు.. ఎక్కడ.. ఎంత తవ్వినా అడిగే వారే లేరు. అక్రమార్కులకు అడ్డే లేదు. వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వ మరియు పట్టా పొలాల్లో సైతం మట్టి తవ్వకాలకు సంబంధిత రెవెన్యూ, గనుల శాఖల అనుమతి పొందాల్సి ఉంది. ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోరు. అధికారులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఫామ్ హౌజ్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. భూమి మెరక చేయ డానికి మట్టి అవసరం. మట్టి ఇష్టానుసారం తవ్వి రవాణా చేస్తున్నారు. రవాణా చేసే టిప్పర్లు మితిమీరిన వేగం స్థానికులను భయపెడుతున్నాయి. పొలాల్లోని మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. రోడ్లు మట్టి రవాణాకు పాడవుతున్నాయని, రోడ్డుపక్కన ఇళ్లలో దుమ్ము చేరుతుందని పలువురు వాపోతున్నారు. బాహాటంగా తవ్వకాలు, రవాణా సాగడం వెనుక అమాత్యుల హస్తం ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అధికారుల అవినీతి, అలసత్వం
రెవెన్యూ అలసత్వంతో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు అధికారులు అవినీతికి పాల్పడడం వలన రవాణా జరుగుతోంది. టిప్పర్ల వేగంతో ప్రమాదాలు జరిగే విధంగా ఉన్నాయి. అనుమతులు లేని మట్టి తవ్వకాలు నిరోధించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.