హైదరాబాద్: పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ (PMT), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ఈ ప్రక్రియను 23 నుంచి 25 పనిదినాల్లో పూర్తి చేస్తామని వెల్లడించింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3వ తేదీ అర్ధరాత్రి వరకు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ కానట్లయితే అభ్యర్థులు.. support@tslprb.inకు ఈ-మెయిల్ చేయవచ్చని, లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నది.
వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు కలిపి పీఎంటీ, పీఈటీల కోసం 2,37,862 మంది అభ్యర్థులు పార్ట్-2 దరఖాస్తును అందజేశారు. ఒక అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసినా.. దేహదారుఢ్య పరీక్ష ఒకేసారి నిర్వహించనున్నట్టు, బోర్డు అధికారులు తెలిపారు. ఒకసారి తీసిన రీడింగ్‌లు అన్ని విభాగాల్లోని పోస్టులకు వర్తిస్తాయని చెప్పారు.
*పరీక్ష కేంద్రాలు..*
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో ఈవెంట్స్ నిర్వహిస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
*వారం ముందే డిజిటల్ పరికరాలు*
పోలీస్ నియమాక ప్రక్రియలో వీలైనంత వరకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేసేలా ఈ సారి ఫిజికల్ ఈవెంట్స్‌లో కూడా సాంకేతికతను వినియోగించనున్నారు. బయోమెట్రిక్ పరికరాలు, ఎత్తును కొలిచే డిజిటల్ మీటర్లు, సీసీటీవీ కెమెరాలు సహా ఇతర సాంకేతిక సామగ్రిని ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణ తేదీ కి వారం ముందే అన్ని కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.