నిజమే.. యూపీ పోలీసులు చెప్పే మాటల్ని వింటే.. చప్పున ఒక సామెత గుర్తుకు వస్తుంది. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎగిరెగిరి తొడ కొట్టిందన్న చందంగా ఉందీ ఈ ఉదంతం గురించి వింటే. యూపీకి చెందిన పోలీసులు ఇప్పుడో చిత్రమైన వాదనను వినిపిస్తున్నారు. సోదాల సందర్భంగా పట్టుకున్న వందల కేజీల గంజాయి ఇప్పుడు ఒక్కసారిగా మాయిమైంది. అదేమని అడిగితే.. ఎలుకలు తినేశాయన్న మాట చెప్పి షాకిస్తున్నారు.
మథుర పోలీసుల మాటలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు. వారి పని తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పేలా మారాయి. తాము సీజ్ చేసిన 586 కేజీల గంజాయిని ఎలుకలు తినేశాయని చెబుతున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు.. వాటిని స్టేషన్ లో భద్ర పరిచారని.. అయితే స్టేషన్ లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో.. నిల్వ ఉంచిన గంజాయిని అవి తినేసినట్లుగా చెబుతున్నారు.
ఎలుకల బారిన పడకుండా ఉంచేందుకు సరైన వసతి లేకపోవటంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఎలుకలు తిన్నది పోగా మిగిలిన గంజాయిని పోలీసులు ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఉదంతమే ఒకటి యూపీలో చోటు చేసుకుంది. అప్పట్లో పోలీసులు సీజ్ చేసిన 1400 కేసుల మద్యాన్ని ఎలుకలు తాగేశాయి. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పటంతో విచారణకు ఆదేశించారు. అందులో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. పోలీసులే ఆ భారీ మద్యం డంప్ ను అమ్మేసినట్లుగా తేలింది. మరి.. ఇప్పుడు వందల కేజీల గంజాయిని ఎలుకలు తినేసిన ఉదంతంపై విచారణకు ఆదేశిస్తే మరెన్ని నిజాలు వెలుగు చూస్తాయో చూడాలి.