ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది.. జనసేన పార్టీ. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆ పార్టీ బలపడిందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఈసారి గట్టిగానే ఉంటుందని ఉండవల్లి అరుణ్కుమార్ లాంటివారు సైతం చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో జనసేన టికెట్లకు మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో చాలామంది టికెట్ ఆశిస్తున్నారని అంటున్నారు.మరోవైపు పిఠాపురం నియోజకవర్గం నుంచి స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ పోటీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో పిఠాపురం టికెట్ను పలువురు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం పిఠాపురం నుంచి వైసీపీ తరఫున పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన కాపు సామాజికవర్గానికి చెందినవారు. పిఠాపురంలో కాపులదే ఆధిపత్యం. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో కాపు ఓటర్లు ఏకంగా 75 శాతం ఉండటం విశేషం. దీంతో జనసేన ప్రభావం ఈ నియోజకవర్గంలో అధికం.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన గెలవగలిగే నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటని చెబుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలుస్తోంది.టికెట్ రేసులో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అల్లుడు కూడా ఉండటం గమనార్హం. అలాగే గతంలో టీడీపీ తరఫున గెలిచిన వర్మ కూడా జనసేన టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 2019లో టీడీపీ టిక్కెట్టు నిరాకరించినా ఆయన పార్టీలోనే ఉన్నారు.
అలాగే పిఠాపురం వైస్ చైర్మన్ అల్లుడు పీలా శ్రీధర్ పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారు. వైద్యుడైన ఆయన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.కాగా ప్రస్తుతం ఇక్కడ జనసేన ఇంచార్జిగా మాకినీడి శేషుకుమారి ఉన్నారు. ఆమె 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో బలమైన అభ్యర్థిని దించితే ఇక్కడ గెలుపొందవచ్చని జనసేన భావిస్తోంది. కాబట్టి బలమైన అభ్యర్థికే సీటు దక్కే అవకాశం ఉంది.