గద్వాలలో వెలుగుచూసిన న్యూడ్ కాల్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. నగ్నంగా కాల్స్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టుగా గద్వాల సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిఖిల్ అనే మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ప్రేమ పేరుతో యువతులను ట్రాప్ చేస్తారని.. ఆ తర్వాత డబ్బు కోసం అమ్మాయిలను వేధిస్తారని.. ఈ ముగ్గురి మధ్య విభేదాలు రావడంతో ఒకరి తర్వాత ఒకరు ఫొటోలను వైరల్ చేశారని అన్నారు. న్యూడ్ ఫొటోల వ్యవహారంలో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఇక న్యూడ్ కాల్ ఫొటోల ఘటనతో గద్వాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా కొందరు ప్రజాప్రతినిధులు అమ్మాయిలతో చనువు పెంచుకొని వారి అసభ్యకర ఫొటోలను స్క్రీన్ షాట్స్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
ఆ ఫొటోలు బయటకు రావడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇద్దరినీ అరెస్ట్ చేసింది. తప్పించుకున్న మరో నిందితుడు నిఖిల్ కోసం ప్రత్యేకంగా కొన్ని టీంలను రంగంలోకి దించారు.
అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న వారిని ఊపేక్షించేది లేదని పోలీస్ శాఖ ప్రకటించింది. ఇందుకు సహకరించిన వారిని కూడా వదిలిపెట్టమని ప్రకటించారు.
ఇక ఈ కేసులో ఎంత మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేశారు? బాధితులు ఎంత మంది అన్న దానిపై పోలీసులు సీరియస్ గా విచారణ జరుపుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.