ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా.. అందరూ సమానమే. పెద్ద కొడుకు అనే మమకారం.. చిన్న కొడుకు అనే వెటకారం.. ఏ తల్లికీ ఉండదు. ఇక ఆడ పిల్లలైనా అంతే. తల్లికి పిల్లలే ప్రపంచం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన పిల్లలకు ఏ చిన్న దెబ్బ తగిలినా.. తల్లి విలవిల్లాడుతుంది. అందుకే అమ్మనుమించిన దైవం లేదని అంటారు. అమ్మ ఈ సృష్టిలో ఎక్కడైనా అమ్మే! కానీ ఓ తల్లి మాత్రం.. తన కొడుకు కోసం.. తన కూతురినే బలి ఇచ్చిందంటే.. నమ్మలేం. కానీ ఇది జరిగింది. మన దేశంలోనే రాజస్థాన్లో చోటు చేసుకుంది. మరి ఆ అమ్మ తెలియక చేసిందా? తెలిసి చేసిందా? తెలియదు కానీ మొత్తానికి ఘోరానికైతే పాల్పడి.. తన కడుపునకు తనే చిచ్చు పెట్టుకుని జైలుపాలైంది.
మూఢ నమ్మకంతో ఓ తల్లి.. కొడుకు కోసం కూతురిని చంపుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన కొడుకు ఎవరినైనా బలి ఇస్తే ఆరోగ్యంగా ఉంటాడని ఎవరో చెప్పగా విన్న ఆ తల్లి.. ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. మూఢ నమ్మకాలతో తన 12 సంవత్సరాల కూతురిని గొంతుకోసి చంపింది ఓ తల్లి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన 16 ఏళ్ల కొడుకు కోసం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిపింది.
రాజస్థాన్లోని బారాన్ జిల్లా అంట ప్రాంతంలో రేఖ హదా అనే మహిళ తన 16 ఏళ్ల కొడుకు నికేంద్ర సింగ్ను ఎంతో ప్రేమగా చూసుకునేంది. అతడికి గుండెలో రంధ్రం ఉంది. మానసిక స్థితి కూడా బాగుండేది కాదు. అతడి ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతున్న ఆమె ఎవరినైనా బలి ఇస్తే పెద్ద కొడుకు ఆరోగ్యంగా ఉంటాడని ఎవరో చెప్పగా నమ్మింది. దాంతో ఈ హత్యకు పాల్పడింది.ఈ మూఢ నమ్మకంతోనే ఆ మహిళ శనివారం తన కూతురు సంజనను గొంతు కోసి చంపిందని పోలీసులు తెలిపారు. మొదట తన చిన్న కొడుకు సింఘంపై దాడి చేయగా అతడు తప్పించుకున్నాడని.. అనంతరం సంజనను హత్య చేసిందని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం తన భర్తపైనా ఇలానే దాడి చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం ఆమెను కేంద్ర కారాగారానికి తరలించారు. దీంతో అనారోగ్యంతో ఉన్న బిడ్డకూడా అనాథ అయ్యాడు.