గడిచిన రెండు.. మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందని.. ఆయన్ను అంతమొందించేందుకు రెక్కీ నిర్వహిస్తున్నట్లుగా జనసేన విడుదల చేసిన అధికార ప్రకటన స్పష్టం చేయటం తెలిసిందే. అంతేకాదు.. ఆపార్టీకి చెందిన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. రెక్కీపై అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థలో వస్తున్న వార్తల గురించి తెలిసిందే. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్.. ఘాటు వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బొండా ఉమ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను హత్య చేసేందుకు రూ.250 కోట్ల సుపారీ ఇచ్చారని.. అందులో భాగంగానే హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లుగా ఆరోపించారు. బొండా ఉమ వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. పవన్ ను హత్య చేసేందుకు ఇంత భారీగా ఒప్పందం జరిగిందా? అన్నది ప్రశ్నగా మారింది. బొండా ఉమ మాటలే నిజమైతే.. ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి? దానికి బాధ్యులు ఎవరు? అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారింది.
పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందన్న దానిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించింది లేదు. చిన్న చిన్న విషయాలకు సైతం తీవ్రంగా రియాక్టు అయ్యే అలవాటున్న జగన్ ప్రభుత్వం.. ఏపీ పోలీసులు.. పవన్ లాంటి ఒక పార్టీ అధినేత హత్యకు రెక్కీ జరిగిందన్న ఆరోపణతో పాటు.. ఆ పార్టీ వారు ఇస్తున్న సమాచారం.. దానికి సంబంధించిన వీడియోలను సుమోటోగా ఎందుకు తీసుకోరు? అన్నది ప్రశ్నగా మారింది.
బొండా ఉమా వ్యాఖ్యల నేపథ్యంలో అయినా.. పవన్ హత్యకు రెక్కీ నిర్వహించారా? అన్న విషయాన్ని తెలంగాణ పోలీసులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. పవన్ తనకు మంచి స్నేహితుడని చెప్పే మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ లో జరిగిన రెక్కీ మీద విచారణకు ఎందుకు ఆదేశించలేదన్న మాట వినిపిస్తోంది. బొండా ఉమ వ్యాఖ్యల నేపథ్యంలో అయినా తెలంగాణ సర్కారులో చలనం వస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.