ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ను కొద్దిరోజుల క్రితమే హస్తగతం చేసుకున్నారు. సుమారు 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని చెల్లించి ఎలాన్ మాస్క్ ఈ సంస్థను కొనుగోలు చేశారు. ట్విట్టర్ తన హస్తగతం కాగానే ఎలాన్ మాస్క్ సీఈఓ పరాగ్ అగర్వాల్.. లీగల్ పాలసీ ట్రస్ట్ సేఫ్టీ హెడ్ విజయ గద్దె.. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్లతోపాటు తొమ్మిది మంది మంది డైరెక్టర్లపై వేటు వేశారు.
ప్రస్తుతం ట్విట్టర్లో ఎలాన్ మాస్క్ ఒక్కరే డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. మిగిలిన వారంతా మాజీలుగా మారిపోయాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్లో భారీ ప్రక్షాళన తప్పదనే సంకేతాలను ఉద్యోగులకు పంపించారు. కీలక పదవుల్లో ఉన్న వారికి న్యాయపరంగా అందజేయాల్సిన సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తున్నాయి. అయితే కిందిస్థాయి ఉద్యోగుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది.
ట్విట్టర్లో ప్రస్తుతం 7500మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. వీరిలో దాదాపు 75 శాతం మందిని ఇంటికి తిరిగి పంపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కేవలం 2వేల మంది ఉద్యోగులతో ట్విటర్ ను నడిపించాలని ఎలాన్ మాస్క్ అనుకుంటున్నారు. ఉద్యోగుల జీత భత్యాలను భారీగా తగ్గించడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తున్నారు.
శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 100 మంది ఉద్యోగులకు విధుల నుంచి తొలగించారని తెలుస్తోంది. ఈమేరకు ఉద్యోగులకు ట్విట్టర్ నుంచి వ్యక్తిగత మెసేజ్ వెళుతున్నాయి. నవంబర్ 4 తేదీ ఉదయం 9 గంటల నుంచే మీ ఉపాధిపై ప్రభావం చూపకపోతే ట్విట్టర్ ఇమెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుందని.. లేనట్లయితే వ్యక్తిగత ఇమెయిల్ వస్తుందనే మెసేజ్ లు సిబ్బందికి వెళుతున్నాయి.
ప్రతీ ఉద్యోగి భద్రతతో పాటు ట్విట్టర్ సిస్టమ్.. కస్టమర్ డేటా నిర్ధారించేందుకు తమ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేసి వేస్తున్నామని.. బ్యాడ్జ్ యాక్సెస్ సైతం నిలిపి వేయబడుతుందని మెయిల్స్ లో పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎవరైనా కార్యాలయంలో ఉన్నా లేదంటే కార్యాలయానికి వచ్చే మార్గంలో ఉంటే దయచేసి తిరిగి ఇంటికి వెళ్లండి అని ట్విట్టర్ నుంచి ఉద్యోగులకు సమాచారం వెళుతోంది.
మరోవైపు ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతా కోసం నెలకు ఎనిమిది డాలర్లను వసూలు చేయాలని ఎలాన్ మాస్క్ నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్లో వైన్ యాప్ ను త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల తొలగింపుతో ఖర్చులు తగ్గించుకుని సరికొత్త కీలక నిర్ణయాలను ఎలాన్ మాస్క్ తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ఉద్యోగులు నెట్ వర్క్ గా ఏర్పడి #OneTeam అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపుపై తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ట్విట్టర్ యాజమన్యం ఫెడరల్ మరియు కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
60 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా కంపెనీలో భారీ తొలగింపులు నిర్వహిస్తోందని ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు నడుస్తున్న తరుణంలోనే ఎలాన్ మాస్క్ మరింత దూకుడుగా ప్రక్షాళన చర్యలు చేపడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.