ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స ప్రజల్లో విశ్వాసానికి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ పమేలా.
( జనసముద్రం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ )
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకంతో స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శ్వాస సంబంధిత సమస్యలపై శస్త్రచికిత్స చేయించుకొని ఆదర్శంగా నిలిచారు. ఆమె ఈ చర్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.తీవ్ర తలనొప్పి, సైనస్ వంటి సమస్యలతో బాధపడుతున్న కలెక్టర్ ఆదివారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల అనంతరం ఎముక పెరుగుదల గుర్తించడంతో, అవసరమైన శస్త్రచికిత్సను ఈ ఎన్ టి సర్జన్ల బృందం విజయవంతంగా నిర్వహించింది. ఇందులో ఎండోస్కోపిక్ నాసల్ సర్జరీ, సెప్టోప్లాస్టీ శస్త్రచికిత్సలు చేశారు. నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ,ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారు. నమ్మకాన్ని కలిగించిన కలెక్టర్ పమేలా సత్పతికి అభినందనలు. ఆమె చర్య ప్రజా వైద్య వ్యవస్థపై విశ్వాసం పెంపొందించేందుకు మార్గదర్శకంగా నిలుస్తుంది,అని పేర్కొన్నారు.ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా కలెక్టర్ చర్యను ప్రశంసించారు.
అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, అంగన్‌వాడీల ప్రగతిలో గతంలోనూ ఆమె విశేష కృషి చేశారు.ఈ ఘటన ప్రభుత్వ ఆసుపత్రులపై సామాన్య ప్రజల్లో నమ్మకాన్ని బలపరిచే దిశగా మైలురాయిగా అభివర్ణించబడుతోంది.





